యాచారం: ప్రధాని మోదీ పాలనలో భారత రాజ్యాంగానికి పెనుప్రమాదం పొంచి ఉందని.. రైతాంగం, పేదలు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగ హక్కులు పొందలేకపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యల బ్రహ్మయ్య సంస్మరణ సభ, స్తూప ఆవిష్కరణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో కార్పొరేట్ శక్తులతో కుమ్మకై ్క డబ్బులతోనే రాజకీయం చేస్తోందన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఇతర పార్టీలను మనుగడ లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగం, కార్మికులు, మహిళలు రాజ్యాంగ ఫలాలు అందక అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై నిత్యం ఏదో ఓ చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకేనేందుకు దేశ ప్రజలు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ముగిసిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ఇతర నిత్యవసరాల ధరలను పెంచేందుకు మోదీ సర్కార్ దృష్టి సారించదని చెప్పారు. దేశం ఆర్థికంగా బలంగా ఉందని నమ్మిస్తూ ప్రజలను బంగారం కొనొద్దు, విదేశీ యాత్రలు చేయరాదు, దుబారా ఖర్చులు పెట్టరాదని ప్రజలను డైలామాల్లో నెట్టారని మోదీపై మండిపడ్డారు.
బ్రహ్మయ్య మృతి పార్టీకి తీరని లోటు
పేదలు, కార్మికుల హక్కుల సాధన కోసం తన చివరి వరకు పోరాడిన బ్రహ్మయ్య మృతి సీపీఎంకు తీరని లోటన్నారు. ఆయన ఆశయాల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన కుటుంబానికి పార్టీకి ఎల్లప్పుడు అండగా ఉంటుంందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పి.జంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, నాయకులు బోడ సామేల్, నర్సింహ, డి.జగదీశ్, చంద్రమోహన్, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న మోదీ సర్కార్
పెండ్యాల బ్రహ్మయ్య సంస్మరణ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


