కొన్నేళ్లుగా పశువుల సంత వేలంలో వచ్చిన ఆదాయం
యాచారం: ఆత్మ నిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డు కింద వచ్చిన రూ.కోటి పారితోషికం దుబారా ఖర్చయింది. గ్రామ పంచాయతీ ఖాతాలో జమ అయినా నగదును నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీ పాలకవర్గం, అధికారుల తీరుతో ఉన్నత లక్ష్యానికి గండిపడ్డట్లు అయింది. 2025 ఏడాదికి గాను మండల పరిధిలోని మాల్ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ఆత్మ నిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డుకు ఎంపికై ంది. గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 ఏప్రిల్ 24వ తేదీన బిహార్ రాష్ట్రంలోని మధుబన్‌లో దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా మాల్ పంచాయతీ కార్యదర్శి రాజు అవార్డు అందుకున్నారు. దీంతోపాటు రూ.కోటి నగదు పారితోషికాన్ని అందుకున్నారు.
ప్రత్యేక ఆర్థిక వనరు కింద ఎంపిక
గతేడాది ఏప్రిల్ నెలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారుల బృందం పలు రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చింది. 19 ఆర్థిక అంశాలపై అధ్యయనం చేసి అప్పటి ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి సూచన మేరకు మాల్ పశువుల సంత ఆర్థిక వనరును గ్రామ స్థాయిలో పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి మంగళవారం ఏర్పాటు చేసే పశువుల సంతతో ఏటా రూ.50 లక్షలకు పైగానే ఆదాయం పొందడం, అది కూడా పంచాయతీ ఆర్థిక వనరు కిందనే ఖర్చు చేస్తుండడంతో ఆత్మ నిర్భర్ నేషనల్ గ్రామ పంచాయతీ అవార్డుకు కేంద్ర ఉన్నతాధికారులు ఎంపిక చేశారు.
వసతుల లేమితో ఇక్కట్లు
ఆత్మ నిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డు కింద మాల్‌కు అందిన రూ.కోటి పారితోషికం దుబారా ఖర్చు అయిందని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అవార్డు తెచ్చి పెట్టిన పశువుల సంత అభివృద్ధికి నిధులు వెచ్చించాలి. కానీ పైసా కూడా సంతకు ఖర్చు చేయలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సమస్యలున్నాయి. క్రయ, విక్రయాలకు తీసుకువచ్చే పశువులకు నీడ, తాగునీటి సౌకర్యం లేదు. రైతులకు, మధ్యవర్తులకు సైతం నిలువ లేదు. సంతకు శాశ్వత స్థలం లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన వెంచర్‌లో మంగళవారం నిర్వహణ కొనసాగుతుంది. ఎండకు, వానాకు పశువులతో పాటు రైతులు, మధ్యవర్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ప్రభుత్వ భూమి సర్వేనంబరు 640లో ఐదు ఎకరాల్లో పశువుల సంతకు శాశ్వత స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినా నేటికి అనుమతులు రాలేదు. ఇంతలోనే నిబంధనలు ఉల్లంఘించి కార్యదర్శి, పాలకవర్గం కనీసం ఎంబీలు లేకుండానే ఇష్టానుసారంగా నిధులను అనవసరమైన పనులకు దుబారా చేశారు.
మాల్ పశువుల సంతకు ప్రతి మంగళవారం పశువుల క్రయ, విక్రయాల కోసం వస్తాను. రూ.వేలాది పన్నులు చెల్లిస్తాను. కానీ సంతలో కనీస సౌకర్యాలు ఉండడం లేదు. పాడి, పశువులు, కాడెద్దుల విక్రయాల కోసం ఎండకే ఉండడంతో వడదెబ్బకు గురవుతున్నాం. తాగునీటి సౌకర్యం కూడా లేదు.
– మహేందర్, వ్యాపారి, మునుగోడు
సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికే రూ.కోటి పారితోషికంలో రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారు. సంతకు శాశ్వత స్థలం కేటాయించాలని కలెక్టర్‌ని కలిసి విజ్ఞప్తి చేశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రొసీడింగ్ రాగానే పనులు చేపడుతాం.
– అశోక్‌యాదవ్, సర్పంచ్, మాల్
రూ.కోటి పారితోషికం గతేడాదిలోనే పంచాయతీ ఖాతాలో జమ అయింది. కానీ పశువుల సంతకు శాశ్వత స్థలం లేకపోవడంతో అభివృద్ధి పనులకు పైసా ఖర్చు చేయలేదు. గ్రామాభివృద్ధి కోసం ఆ నిధులను వెచ్చించాం. రూ.40–50 లక్షలకు పైగానే వివిధ పనులకు ఖర్చు చేశాం.
– రాజు, పంచాయతీ కార్యదర్శి, మాల్
రూ.కోటి పారితోషికం దుబారా
మాల్‌కు ఆత్మ నిర్భర్ జాతీయ అవార్డు
గుర్తింపు తెచ్చిన పశువుల సంతపై నిర్లక్ష్యం
పైసా ఖర్చు చేయని పంచాయతీ పాలకవర్గం
కనీస పర్యవేక్షణ చేయని ఉన్నతాధికారులు
ఏడాది ఆదాయం(రూ.లక్షల్లో)
2021–22 రూ.53
2022–23 రూ.59
2023–24 రూ.71
2024–25 రూ.73
2025–26 రూ.82
2026–27 రూ.105


