సోలార్‌ సబ్‌స్టేషన్లు! | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ సబ్‌స్టేషన్లు!

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

పోర్టల్‌లో 22,809 అర్జీలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఐటీ అనుబంధ సంస్థలు, రియల్‌ ఎస్టేట్స్‌ నిర్మాణాలు, పారిశ్రామిక పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారిన జిల్లాలో విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. అధికమైన కాలుష్యం, తరుగుతున్న బొగ్గు నిల్వలు, భవిష్యత్తు విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంప్రదాయ విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి సారించింది. ఇప్పటికే పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యాపార వాణిజ్య సంస్థలు, అపార్ట్‌మెంట్లు, గెటెడ్‌ కమ్యూనిటీలు, వ్యక్తిగత నివాసాలపై సోలార్‌ప్లాంట్‌ను ప్రోత్సహిస్తోంది. అంతేకాదు వికారాబాద్‌లోని కొండారెడ్డిపల్లి సహా రంగారెడ్డి జిల్లాలోని నందిగామను మోడల్‌ సోలార్‌ గ్రామాలుగా ఎంపిక చేసింది. గృహాలు సహా వ్యవసాయ పంపుసెట్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. తాజాగా సబ్‌స్టేషన్లను కూడా ఇందుకు ఎంపిక చేసింది. జనరేటెడ్‌ డిస్ట్రిబ్యూటెడ్‌ పథకంలో భాగంగా సబ్‌స్టేషన్ల ఆవరణలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది సబ్‌స్టేషన్లను ఎంపిక చేయగా, అందులో రెండు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండటం విశేషం.

ఒక మెగావాట్‌ ప్లాంట్‌

రంగారెడ్డి జిల్లాలో 20 లక్షలకుపైగా, వికారాబాద్‌లో మూడు లక్షల వరకు విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో రోజు సగటు విద్యుత్‌ వినియోగం 40 మిలియన్‌ యూనిట్లకుపైగా నమోదవుతుంది. వేసవిలో ఈ డిమాండ్‌ మరింత పెరుగుతోంది. డిమాండ్‌కు సరఫరాకు మధ్య పొంతన లేకపోవడంతో అనధికారిక కోతలు అమలు చేయాల్సి వస్తోంది. భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్‌స్టేషన్లలో సోలార్‌ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది సబ్‌స్టేషన్లు ఎంపిక చేయగా, వీటిలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ షాద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో కేశంపేట్‌ సహా వికారాబాద్‌ డివిజన్‌లోని మోమిన్‌పేట్‌ సబ్‌స్టేషన్లు ఇందుకు ఎంపిక చేశారు. ఒక్కో సబ్‌స్టేషన్‌లో మూడు ఎకరాల విస్తీర్ణంలో రూ.3.50 కోట్ల అంచనా వ్యయంతో ఒక మెగావాట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయయాలని నిర్ణయించారు. రోజుకు సగటున 6,000 యూనిట్ల చొప్పున.. ఇలా రెండు చోట్ల కలిపి రోజుకు 12 వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను అక్కడే పంపిణీ చేయనున్నారు.

మోమిన్‌పేట, కేశంపేటలో సౌర పలకల ప్లాంట్లు

సబ్‌స్టేషన్‌ ఆవరణలోనే విద్యుత్‌ ఉత్పత్తి

రూ.7 కోట్ల అంచనాతో ఏర్పాటు

రోజుకు సగటున 12 వేల యూనిట్ల ఉత్పత్తికి అవకాశం

పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ పథకం కింద జాతీయ పోర్టల్‌లో 22,809 మంది దరఖాస్తు చేసుకోగా, 13,080 మంది మాత్రమే సౌర ఫలకలు అమర్చుకున్నారు. ఇళ్లపై కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే ఒక కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు నుంచి 10 కిలోవాట్లకు గరిష్టంగా రూ.78 వేలు రాయితీ పొందొచ్చు. అదే విధంగా అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉమ్మడి అవసరాల కోసం సౌర ప్లాంటును ఏర్పాటు చేసుకోవచ్చు. కిలోవాట్‌కు రూ.18 వేల చొప్పున 500 కిలోవాట్ల వరకు రాయితీ పొందొచ్చు. మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంటు ఏర్పాటుకు సుమారు రూ.2,10,220 ఖర్చు అవుతుంది. రోజుకు 12 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. కేంద్రం నూతన, పునరుత్పాదక మంత్రిత్వ శాఖ(ఎంఎన్‌ఈఆర్‌) నుంచి రూ.78 వేలు సబ్సిడీ వస్తుంది. మిగిలిన మొత్తానికి గతంలో బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. ఇటీవల బ్యాంకులు ఆసక్తి చూపక పోవడం కూడా మెజార్టీ వినియోగదారులు సౌరపలకలు ఏర్పాటు ముందుకు రావడం లేదు. ఇంధన కొరత, కాలుష్య నియంత్రణ చర్యలో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తుంది. జిల్లాలో 57,911పైగా ఎలక్ట్రిక్‌ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. రాబోయే విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకుని నిలబడాలంటే ఇప్పటి నుంచే సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement