● ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
● ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల
షాద్‌నగర్: అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడేందుకు చేసే సీపీఆర్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్డియాలజిస్ట్ డాక్టర్ చందులాల్ రాథోడ్ విద్యార్థులకు కార్డియోపల్మోనరీ రెస్యూసిటేషన్(సీపీఆర్)పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుండెపోటు సమయంలో మెదడుతో పాటు కీలక అవయవాలకు ఆక్సిజన్ ఉన్న రక్తం అందేలా చేసే ప్రాణరక్షణ చర్యే సీపీఆర్ అన్నారు. దీనిద్వారా ఆకస్మిక గుండెపోటు బాధితులకు ప్రాణరక్షణ అవకాశాలను 60శాతం మెరుగుపర్చని తెలిపారు. అనంతరం డాక్టర్ చందులాల్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి అకస్మాత్తుగా ప్రమాదం జరిగినప్పుడు ఎదపై భాగంలో రెండు చేతులతో ఇంటర్లాక్చేసి నిమిషానికి 100నుంచి 200 సార్లు ఛాతిని నొక్కాలన్నారు. ముక్కుమూసి నోటిద్వారా బలంగా శ్వాస అందించాలని, ఈ విధంగా కనీసం 45 నిమిషాలు చేయాలని సూచించారు. అంబులెన్స్ సాయంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పాలాది శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ శాంతి, డాక్టర్ జయ, దేవయ్య, నదిర, అనురాధ, విద్యార్థులు పాల్గొన్నారు.


