సర్వేకు ఓవర్‌ ల్యాప్స్‌ గండం | - | Sakshi
Sakshi News home page

సర్వేకు ఓవర్‌ ల్యాప్స్‌ గండం

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

నకిలీలు తీసేస్తాం

● మొండిగౌరెల్లిలో నిలిచిన 68 సర్వేనంబరు అసైన్డ్‌ భూ సర్వే ● ఉన్నతాధికారులకు నివేదించిన అధికారులు

యాచారం: మండలంలోని మొండిగౌరెల్లిలో అసైన్డ్‌ భూముల సర్వే నిలిచింది. పక్షం రోజులుగా జోరుగా సాగిన సర్వేను అధికారులు రెండు రోజులుగా నిలిపేశారు. గ్రామంలోని అసైన్డ్‌ సర్వేనంబర్లు 19, 68, 127లతో పాటు పలు పట్టా సర్వేనంబర్లల్లోని మొత్తం 822.11 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్‌ల పేరుతో సేకరించడానికి సర్కార్‌ నిర్ణయించింది తెలిసిందే. ప్రస్తుతం 500 ఎకరాల వరకున్న అసైన్డ్‌ భూమిని సేకరించడానికి భూ సర్వే చేపట్టారు. కొద్ది రోజులుగా 19, 127లలోని 300 మందికి పైగా రైతులకు చెందిన భూ కబ్జా సర్వే చేపట్టారు. ఇంకా ఆయా సర్వే నంబర్లల్లోని రైతుల కబ్జాను సర్వే చేయడం మిగిలింది. సర్వేనంబరు 127, 19 లలోని భూమిని సాఫీగా సర్వే చేసిన అధికారులు 68 సర్వే నంబరు బార్డర్‌కు వచ్చే సరికి సర్వేకు ఆటంకం ఏర్పడింది. ఎకరాకు రూ.30 లక్షల పరిహారంతో పాటు, ఎకరాకు 121 గజాల ప్లాటు, అదనంగా రైతు కుటుంబాలకు మరొక 121 గజాల ప్లాటు ఇచ్చేందుకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అంగీకరించారు. దీంతో రైతులు భూసర్వేకు సమ్మతించారు.

రికార్డుల పరిశీలన

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూసర్వేను నిలిపేసిన అధికారులు ఆ లోపు ప్రస్తుతం వరకు పూర్తి చేసిన సర్వే రికార్డులను పరిశీలన చేయడానికి నిర్ణయించారు. 127లో మొత్తం అసైన్డ్‌ భూమి 122.02 ఎకరాలు ఉంది. 108.30 ఎకరాలను అసైన్డ్‌ చేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌లో మాత్రం 113.34 ఎకరాలను నోటిఫికేషన్‌లో ప్రకటించారు. 19లో మొత్తం భూమి 575.30 ఎకరాలు ఉండగా, 400 ఎకరాలను గుర్తించారు. 68లో రికార్డుల ప్రకారం మొత్తం 788.20 ఎకరాలు ఉండగా కేవలం 203.16 ఎకరాలను మాత్రమే అసైన్డ్‌ చేశారు. ఈ 68 సర్వేనంబరులోని మిగిలిన భూమి పూర్తిగా గుట్టలు, రాళ్లు, రప్పలతో కూడి వ్యవసాయానికి యోగ్యంగా పనికి రాకుండా ఉంది.

68 సర్వేనంబరులో టెన్షన్‌

సర్వేలో భాగంగా 68 సర్వేనంబరులో అసైన్డ్‌ భూమి ఓవర్‌ ల్యాప్స్‌తో అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. ఈ సర్వేనంబర్‌ అసైన్డ్‌ భూమి యాచారం–మంచాల మండలాల సరిహద్దులో ఉంది. మొత్తం అసైన్డ్‌ భూమి 788.20 ఎకరాల ఉంది. ఇందులో 203.16 ఎకరాలే అసైన్డ్‌ చేశారు. అనేక అనధికార నకిలీ సర్టిఫికెట్లు పుట్టుకొచ్చాయి. ఈ సర్వేనంబరులో పేరుకే 788.20 ఎకరాలు కాని ట్యాడ్‌ పోజిషన్‌ చూస్తే మాత్రం కేవలం 300 ఎకరాలే ఉంటుంది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో 68 సర్వేనంబర్‌లోని 500 ఎకరాల్లో చంచల్‌గూడ జైలును తరలించి ఇక్కడ నిర్మించడానికి అధికారులు నిర్ణయించారు. కొద్ది రోజుల పాటు రెవెన్యూ, సర్వే, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు సర్వే కూడా చేశారు. 68 సర్వేనంబర్‌లో పేరుకే 788.20 ఎకరాలు కానీ పోజిషన్‌ చూస్తే మాత్రం 300 ఎకరాలే ఉండడంతో జైలు నిర్మించడానికి నిరాకరించారు. ప్రస్తుతం 68 సర్వేనంబర్‌లోని ఓవర్‌ట్యాప్స్‌తో ఏం చేయాలో తోచక సర్వే, రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుని ఉన్నతాధికారులకు చేరవేశారు. ఉన్నతాధికారుల సూచన మేరకు భూసర్వేను కొద్ది రోజుల పాటు నిలిపేశారు.

మొండిగౌరెల్లిలో ఇప్పటివరకు చేసిన భూ సర్వేకు సంబంధించి రైతుల భూ రికార్డులను పరిశీలన చేస్తున్నాం. నిజమైన అసైన్డ్‌ రైతులకు అన్యాయం కాదు. నకిలీలుంటే మాత్రం రికార్డుల్లోంచి వారి పేర్లను తీసేస్తాం. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తాం. 68 సర్వేనంబర్‌లోని అసైన్డ్‌ భూమి సర్వేపై ఉన్నతాధికారుల సూచనతో ముందుకు వెళ్తాం.

– అయ్యప్ప, తహసీల్దార్‌, యాచారం

Advertisement
 
Advertisement
Advertisement