ఇబ్రహీంపట్నం: అధికారుల పనితీరును గాడిలో పెట్టి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిపాలన సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయికి మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్ పర్సన్ ముత్యాల శ్యామల, కౌన్సిలర్లు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో మైజార్టీ స్థానాలు బీఆర్‌ఎస్ పార్టీ కై వసం చేసుకుందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తమకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కకుండా అనేక రకాలుగా వేధింపులకు, ప్రలోభాలకు గురిచేయడంతో పాటు కేసులు పెట్టారన్నారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలతో చైర్మన్‌గా తాను, వైస్ చైర్మన్‌గా బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల ఎన్నికై నప్పటికీ వేధింపులు తప్పడం లేదన్నారు. పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తమకు మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ తదితర సిబ్బంది తమకు సహకరించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మారాలని తనపై అధికార పార్టీ ఒత్తిళ్లకు గురిచేసిందని చెప్పారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్‌తోపాటు సంబంధిత అధికారులు డుమ్మా కొట్టారన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని త్వరలో విజిట్ చేసి పరిస్థితులను సమీక్షిస్తానని అదనపు కలెక్టర్ చెప్పారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మురళీకృష్ణ, ప్రవీణ్‌కుమార్, మమతరాజు, శ్రీలత, త్రిలోక్‌కుమార్, శంకర్, లక్ష్మమ్మ, జయ, బుగ్గరాములు, శ్వేత, గిరీశ్, నాయకులు భాస్కర్, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ కిరణ్మయికి మున్సిపల్ చైర్మన్ వినతి


