ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
అబ్దుల్లాపూర్‌మెట్: బాటసింగారం, కొత్తగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు, లే అవుట్లలోని పార్కు స్థలాలను ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ సభ్యుడు విష్ణుగౌడ్ సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో వార్డు సభ్యుడిగా పనిచేసి, ప్రస్తుతం ఉపసర్పంచ్‌గా కొనసాగుతున్న నార్లకొండ వెంకటేశ్ అక్రమంగా ఇంటి నంబర్లను పొంది సదరు స్థలాలను ఆక్రమించుకున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో పనిచేసిన సర్పంచ్ సహకారంతో అక్రమంగా ఇంటి నంబర్లను తీసుకొని సుమారు 100 ప్లాట్లను ఆక్రమించుకున్నట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇంటి నంబర్లు, అసెస్‌మెంట్ల ద్వారా అతనితో పాటు బినామీలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడని పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు.


