‘లోకల్’ పర్యాటకం!
నూతన సంవత్సర వేడుకలను సరదాగా జరుపుకొనేందుకు చిన్నాపెద్దా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సందర్శనీయ స్థలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను చుట్టి రావాలని భావిస్తున్నారు. కొద్దిపాటి సమయం, తక్కువ ఖర్చుతో.. మనచెంతే ఆహ్లాదం పొందగలిగే జిల్లాలోని టూరిజం స్పాట్లపై ఓ లుక్కేద్దామా..
వికారాబాద్: జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో అనంతగిరి గుట్ట, ఫారెస్ట్ ఉంది. ఇక్కడ భారీ హనుమాన్ విగ్రహం, అనంతపద్మనాభ స్వామి ఆలయం, కోనేరుతో పాటు చుట్టు పక్కల రిసార్టులు ఉన్నాయి. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. పచ్చని ప్రకృతికి పెట్టింది పేరు. దట్టమైన అడవి, ఎత్తైన కొండలతో చూపరులను కట్టిపడేస్తుంది. గుట్టపై చారిత్రక అనంత పద్మనాభస్వామి ఆలయం వెలిసింది. ఇక్కడ ట్రెక్కింగ్ స్పాట్లు, వందలాది రకాల పక్షులు మనసుకు హాయిగొల్పుగాయి. తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన కార్టేజీలు, పక్కనే బుగ్గ రామేశ్వరాలయం ఉన్నాయి. ధారూరు మండల పరిధిలోని కో ట్‌పల్లి ప్రాజెక్టులో, అనంతగిరి సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
మనచెంతే ఆహ్లాదం
టూరిజం అభివృద్ధి దిశగా అడుగులు
రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకులు
ఇయర్ ఎండింగ్, న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు
అతిపెద్ద ఖగోళ పరిశోధన కేంద్రం
మంచాల: ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ఖగోళ పరిశోధన కేంద్రంగా వెలుగొందిన జాపాల్– రంగాపూర్ నక్షత్రశాల నగరానికి కూత వేటు దూరంలో ఉంది. ప్రస్తుతం ఇది ఉస్మానియా యూనివర్సీ టికి అనుబంధంగా పని చేస్తోంది. 1963లో ఆస్ట్రానమీ డైరెక్టర్ కేడీ అభయాంకర్ సూచన మేరకు, కాలుష్యానికి దూరంగా నగరానికి 51 కిలోమీటర్ల దూరంలో, జాపాల్– రంగాపూర్ అటవీ ప్రాంతంలోని ఎత్తై న ప్రదేశంలో దీన్ని నిర్మించారు. 220 ఎకరాల్లో విస్తరించిన ఉన్న పరిశోధన కేంద్రం 1968లో అందుబాటులోకి వచ్చింది. 1980 ఫిబ్రవరి16న స్కైలాబ్‌ను ఇక్కడ నుంచే పరిశీలన చేశారు. 1986 ఫిబ్రవరి 9న హేలీ తోక చుక్కలు, ఇతర పాలపుంత లను ఇక్కడి నుంచే గమనించారు. 1994 జూన్16 నుంచి 21 వర కు వేర్వేరు తోక చుక్కలు, బృహస్పతి గ్రహాన్ని ఢీకొట్టిన చిత్రాలు, గ్రహాలపై ఏర్పడిన మచ్చల ఛాయాచిత్రాలను కూడా ఇక్కడి నుంచే తీశారు.
పుణ్యక్షేత్రమైన పులిలొంక!
మోమిన్‌పేట: ఒకప్పుడు పులులు సంచరించే ప్రాంతం.. ప్రస్తుతం ఆధ్యాత్మిక క్షేత్రమై విరాజిల్లుతోంది. 60ఏళ్ల క్రితం వరకు ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. ఓ మేకల కాపరి, నిత్యం తన మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు. ఈక్రమంలో 20 ఏళ్ల పాటు ఒంటరిగా శ్రమించి ఓ గుట్టను గుహగా మలిచాడు. సుమారు 20 మీటర్ల పొడవు, 4మీటర్ల వెడల్పుతో గుహను తీర్చిదిద్ది లోపల వేంకటేశ్వరస్వామి విగ్రహం, గుహ ప్రారంభంలో లక్ష్మీనారసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. దీంతో పులి లొంక.. పుణ్యక్షేత్రమైంది. మేకల కాపరి పర్మయ్య.. పరమదాసుగా మారాడు. చుట్టూ ఎతైన గుట్టలు, దట్టమైన అడవి, ఆహ్లాదమైన ప్రదేశం, పచ్చని చెట్లు, చల్లని గాలులతో ఇక్కడి వాతావరణం భక్తుల మనసులను కట్టిపడేస్తోంది. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి గుడి, శివాలయం, గుహలో వేంకటేశ్వరస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు.
మార్గం ఇలా..
హైదరాబాద్ నుంచి 68 కిలోమీటర్లు, మోమిన్‌పేటకు 9కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. వికారాబాద్ నుంచి సదాశివపేట వెళ్లే మార్గంలో, వెల్‌చాల్ బస్టాండు వద్ద బస్సు దిగి, 2కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి ఆటోల్లో చేరుకోవచ్చు. ప్రతీ 20 నిమిషాలకు ఓ బస్సు ఉంటుంది. వికారాబాద్, జహీరాబాద్ నుంచి రైలు సదుపాయం ఉంది. వెల్‌చాల్ సమీపంలో సదాశివపేట రోడ్డు స్టేషన్‌లో రైలు దిగితే ఆటోలో వెళ్లవచ్చు.
పోలేపల్లిలో.. ఎల్లమ్మతల్లి
కొడంగల్: దుద్యాల మండలం పోలెపల్లిలో స్వయంభువుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం పర్యాటకులు, భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.పచ్చని పంట పొలాల మధ్య వెలిసిన అమ్మవారి కనువిందు చేస్తుంది. ఇక్కడ నిర్వహించే పెద్దజాతర ఈప్రాంతంలోనే అతిపెద్ద వేడుక. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన భక్తులు వేలాదిగా తరలివస్తారు. యాటలు.. కోళ్లతో మొక్కులు సమర్పించుకుని, విందు చేసుకుంటారు. ఇక్కడ నిర్వహించే అమ్మవారి సిరిమానోత్సవం సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు.
ఆధ్యాత్మికం.. పర్యాటకం
తాండూరు: దివ్య క్షేత్రాలకు నిలయం తాండూరు ప్రాంతం. కాగ్నానది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున శివాలయాలు వెలిశాయి. ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. పట్టణంలోని భావిగి భద్రేశ్వరాలయం, జుంటుపల్లిలోని రామచంద్రస్వామి దేవాలయం, నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో వెలిసిన రామలింగేశ్వరాలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్నాయి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఇరు రాష్ట్రాల ప్రజలు, పర్యాటకులు ఉత్సాహం చూపుతుంటారు. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో వెలసిన ఏకాంబర రామలింగేశ్వరాలయం అన్ని మతాల వారికి ఆదర్శంగా నిలిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోంది. ఇక్కడి పుష్కరిణి మధ్యలో రామలింగేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. దీనికి పక్కనే యాకూబ్‌సాబ్ దర్గాలున్నాయి.
విండ్ పవర్.. బోటింగ్
పరిగి: మండలంలోని లక్నాపూర్ ప్రాజెక్టు, విండ్ పవర్(పవన విద్యుత్) పాంట్లు, కాళ్లాపూర్ సమీపంలోని లొంక పుణ్యక్షేత్రం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సెలవు రోజులు, వారాంతంలో నగరవాసులు ఇక్కడ విడిదికి వస్తుంటారు. లొంక సప్తముఖి ఆంజనేయస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. హైదరాబాద్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ మీదుగా పరిగికి చేరుకుని వీటిని చేరుకోవచ్చు. కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్లలో ఏకఽశిలపై వెలిసి పాంబండ రామలింగేశ్వరస్వామి భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నాడు.
‘లోకల్’ పర్యాటకం!
‘లోకల్’ పర్యాటకం!
‘లోకల్’ పర్యాటకం!
‘లోకల్’ పర్యాటకం!


