అది రాజకీయ కుట్రే
● ‘ఉపాధి’ నుంచి గాంధీ పేరు తొలగింపు తగదు
● టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి
మీర్‌పేట: ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడం రాజకీయ కుట్రలో భాగమని టీయూఎఫ్‌ఐడీసీ ఛైర్మన్ చల్లా నర్సింహారెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు ఆదివారం జిల్లెలగూడ చందన చెరువు కట్టపై ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మక ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడం దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు చేసిన ఘోర అవమానమని అన్నారు. యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ సంకల్పంతో గ్రామీణ పేదలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. ఈ పథకంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు చాలావరకు తగ్గాయన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు నిధులు తగ్గించడంతో పాటు బకాయిలు పెంచడం, పనిదినాల్లో కోతలు విధించడం ద్వారా గ్రామీణ ఉపాధి హక్కును బలహీనపరిచిందని విమర్శించారు. మహాత్మాగాంధీ పేరు తొలగింపు ప్రయత్నాలను మానుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు. అంతకు ముందు ఆయన మందమల్లమ్మ చౌరస్తాలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, స్థానిక నాయకులు చల్లా బాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, కృష్ణ, రాజ్‌కుమార్, పద్మశ్రీ, అరుణ, పద్మారెడ్డి, మాదరి శ్రీనివాస్, విజయవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


