శంకర్‌పల్లి: విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమ అభిరుచులపై కచ్చితమైన నిబద్ధతతో ఉండి, వాటిని సాకారం చేసుకోవాలని ప్రముఖ సినీ నటి అమల అన్నారు. దొంతాన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న త్రిథి–2026 కార్యక్రమానికి గురువారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభ, సృజనాత్మకతను ఇలాంటి కార్యక్రమాల ద్వారా బయటకు తీయొచ్చని అన్నారు. బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సంస్థతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జంతు సంక్షేమం, పరిరక్షణ, స్టెరిలైజేషన్ గురించి మాట్లాడారు. వీధి కుక్కలపై మనుషులు క్రూరంగా కాకుండా మానవత్వంతో వ్యవహరించాలని, వాటిని చంపకుండా సంరక్షణ కేంద్రాలకు తరలించే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఇక్ఫాయ్ వీసీ ప్రొ. డా. కోటిరెడ్డి, రిజిస్ట్రార్ విజయలక్ష్మి, లా స్కూల్ అసిస్టెంట్ డీన్ డా.అరుణ్ కుమార్, ఇక్ఫాయ్ సొసైటీ చైర్‌పర్సన్ శోభారాణి, లా స్కూల్ డైరెక్టర్ ప్రొ. డా.రవిశేఖర రాజు, కో–ఆర్డినేటర్ డా.గౌరీ బి. చనాల్ తదితరులు పాల్గొన్నారు.


