అక్రమ భూ కేటాయింపులపై పోరాటం | - | Sakshi
Sakshi News home page

అక్రమ భూ కేటాయింపులపై పోరాటం

Apr 3 2026 9:55 AM | Updated on Apr 3 2026 9:55 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

కందుకూరు: ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్‌సిటీ పేరుతో పప్పు బెల్లాలు పంచినట్లు సీఎం తన అనుయాయులకు పంచి పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డితో కలిసి కందుకూరు మండలం సార్లరావులపల్లిలోని పెద్దమ్మతల్లి దేవాలయం వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఫార్మా భూములను తిరిగి రైతులకు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. అన్యాయంగా, అక్రమంగా చేస్తున్న భూ కేటాయింపులపై పోరాటం చేస్తామన్నారు. ఫార్మాసిటీ పెడతారా లేక రైతులకు భూములు తిరిగిస్తారా అని నిలదీశారు. కేసీఆర్‌ హయాంలో మహేశ్వరం నియోజకవర్గానికి రూ.100 కోట్లతో మెడికల్‌ కళాశాల, రూ.150 కోట్లతో 250 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి భూమిని కేటాయించి శంకుస్థాపన చేసిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసి ఎల్‌బీనగర్‌కు తరలిస్తోందని విమర్శించారు. ఎల్‌బీనగర్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాల్సిన స్థలంలో మెడికల్‌ కళాశాల నిర్మిస్తున్నారన్నారు. ఇక్కడే మెడికల్‌ కళాశాలతో పాటు 250 పడకల ఆస్పత్రి నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

అవగాహన లేకుండా కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏడు మండలాలను బీజేపీ పాలనలోనే ఏపీకి ఇచ్చారన్నారు. లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్టును తెలంగాణకు లేకుండా చేసింది బీజేపీనే అన్నారు. అవగాహన లేకుండా కిషన్‌రెడ్డి విభజన చట్టంలోనే ఉందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరంపై కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేంద్ర మంత్రి, సీఎం ఇద్దరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటున్నారని, మరి లక్ష ఎకరాలు ఎలా సాగవుతున్నాయని ప్రశ్నించారు. కాళేశ్వరంతో తెలంగాణలో ఆయకట్టు పెరిగిందని సోషల్‌ ఎకనామిక్‌ సర్వేలో కేంద్ర ప్రభుత్వమే తెలిపిందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీ కూడా కాళేశ్వరంతోతెలంగాణ స్వరూపమే మారిపోయిందని మెచ్చుకున్నారనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ కట్టిందని రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి ఇద్దరూ కూడబలుక్కుని బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్‌, జి.లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రవీణ్‌నాయక్‌, మేఘనాథ్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కాకి రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement