ఎన్నికకు అడ్డొస్తే ప్రజలు క్షమించరు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికకు అడ్డొస్తే ప్రజలు క్షమించరు

Apr 3 2026 9:55 AM | Updated on Apr 3 2026 9:55 AM

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: స్థానికంగా ఈ నెల 4వ తేదీన జరిగే మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు అధికార కాంగ్రెస్‌ అడ్డుపడితే ప్రజలే తగినవిధంగా బుద్ధి చెబుతారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాన్ని అడ్డు పెట్టుకొని ఎన్నికలను ఆపాలేరన్నారు. మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు బీఆర్‌ఎస్‌ గెలిచిన అప్రజాస్వామ్యంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వ్యవహారిస్తున్నారని.. ఈ తీరును మార్చుకోవాలన్నారు. ఎన్నికలు జరిగి 50 రోజులు దాటినా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతుండటంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై, తన కుమారుడు ప్రశాంత్‌రెడ్డిపై కిడ్నాప్‌ కేసు వేయడం దారుణమన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఒక్క కేసులేదన్నారు. ఇప్పటికి రెండుసార్లు జరిగిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను బెదిరించి వాయిదా వేయించారన్నారు. 4వ తేదీన జరిగే ఈ ఎన్నికను మళ్లీ గొడవలు సృష్టించి వాయిదా వేయిస్తే ఇక ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రమణారెడ్డి, మాజీ డైరెక్టర్‌ కిరణప్ప, విద్యార్థి విభాగం నాయకులు జగదీశ్‌, అరవింద్‌, శివసాయి తదితరులు పాల్గొన్నారు.

మదర్‌ డెయిరీకి పూర్వ వైభవం తెస్తాం

చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి

హయత్‌నగర్‌: ప్రభుత్వ చొరవతో ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు)తో ఒప్పందం చేసుకుంటున్నామని, దీంతో డెయిరీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి పూర్వ వైభవం తీసుకొస్తామని నార్ముల్‌ మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. హయత్‌నగర్‌లోని పాలనా భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లలో జరిగిన అవకతవకల కారణంగా డెయిరీ నష్టాల్లోకి వెళ్లిందన్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీబీఐ విచారణ చేపట్టిందని, విచారణలో భాగంగా అప్పటి నుంచి ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లు, సిబ్బందికి నోటీసులు ఇచ్చిందని తెలిపారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది తమపై మాత్రమే విచారణ జరుగుతన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసత్య ప్రచారాలను రైతులు, ఉద్యోగులు నమ్మొద్దన్నారు. డెయిరీలో జరిగిన అవినీతిపై రాష్ట్ర కో ఆపరేటివ్‌ విభాగం విచారణ చేపట్టిందని అందుకు డీసీఓతో కమిటీ వేసినట్లు వెల్లడించారు. ఎన్‌డీడీబీతో ఒప్పందంతో అవినీతికి చెక్‌ పెడతామని, పాల సేకరణ, మార్కెట్‌ను పెంచుతామని, రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తామని వివరించారు. వారం రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుందని, ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి సానుకూలంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎండీ కాటెపల్లి లింగారెడ్డి, ఏఓ అబ్దుల్‌ గఫార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ్యూచర్‌సిటీలో సీఎంతో భేటీ

మహేశ్వరం: ఫ్యూచర్‌సిటీ పరిశీలనకు విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ సుధీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డిలతో పాటు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఏసీపీలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏసీపీలు జానకిరెడ్డి, రాజు, సీఐలు రాఘవేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement