మంచాల: పదో తరగతి పరీక్షలు మంచాల కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ) విద్యార్థినులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. కేజీబీవీ భవనాన్ని ఎస్‌ఎస్‌సీ పరీక్ష కేంద్రంగా ఎంపిక చేయడంతో పరీక్షలున్న రోజు ఆ విద్యార్థినులను బయటకు పంపించేస్తున్నారు. సమీపంలోని మహిళా సమాఖ్య పాత భవనంలో ఈ చిన్నారులకు తరగతులు నిర్వహిస్తున్నారు. మహిళా సమాఖ్య భవనంలో ఒకే హాల్ ఉండడం.. ఒక్క హాల్‌లోనే 200 మంది విద్యార్థినులకు తరగతులు నిర్వహిస్తుండడం అసౌకర్యంగా మారింది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. మండల పరిధిలో పెద్ద భవనాలున్న పాఠశాలలున్నప్పటికీ.. ఇక్కడే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు మండి పడుతున్నా రు. మహిళా సమాఖ్య భవనంలో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పరీక్ష కేంద్రాన్ని తరలించడమో.. లేక పరీక్షలున్న రోజు ప్రత్యామ్నాయంగా వసతులున్న భవనంలో తరగతులు నిర్వహించాలని సూచిస్తున్నారు.
ఇబ్బందులు కలిగించొద్దు
పదో తరగతి పరీక్షల పేరిట విద్యార్థినులను ఇబ్బంది పెట్టడం సరికాదు. వారికి అన్ని రకాల వసతులున్న చోట తరగతులు నిర్వహించాలి. లేకుంటే పరీక్ష కేంద్రాన్ని మరో చోటుకు మార్చాలి. పరీక్షలున్న రోజుల్లో ఒకే గదిలోనే నిర్వహించడం సరికాదు. – ప్రశాంత్‌యాదవ్, బీఆర్‌ఎస్వీ మండల ప్రధాన కార్యదర్శి
పది సెంటర్ ఏర్పాటుతో కేజీబీవీ విద్యార్థినులకు తిప్పలు


