తప్పుల తడకగా భూ సర్వే
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య
శంకర్‌పల్లి: మండల పరిధిలోని మోకిల సర్వే నంబర్ 96లో రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే తప్పుల తడకగా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య ఆరోపించారు. సోమవారం మండల పరిధిలోని పొన్నగుట్ట తండాకు చెందిన అసైన్డ్ పట్టాదారులు దేవగత్ శంకర్, కిషన్, ఆంబ్రియా, రాంసింగ్ శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య, బాధితులు మాట్లాడుతూ.. మోకిలలో హెచ్‌ఎండీఏ ఫేజ్–2 లేఅవుట్ కోసం గతంలో ఇచ్చిన అసైన్డ్ పట్టా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం ఎకరాకు 750–800 గజాల స్థలం ఇవ్వనుంది. కాగా అధికారులు చేపట్టిన ప్రాథమిక సర్వేలో అవకతవకలు జరిగాయి. కబ్జాలో ఉన్న లబ్ధిదారుల పేర్లు కాకుండా ఇతరుల పేర్లను లబ్దిదారులుగా గుర్తించి, జాబి తా రూపొందించార్నారు. దీంతో పట్టా కల్గిన లబ్ధిదారులు అందోళన వ్యక్తం చేసి, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై తహసీల్దార్ సురేందర్‌ని వివరణ కోరగా.. ప్రాథమికంగా చేసిన సర్వే ఫైనల్ కాదని, ఆ సర్వేపై పట్టాదారుల నుంచి ఫిర్యాదులు, అభిప్రాయ సేకరణ తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పానుగంటి పర్వతా లు, కె.రామస్వామి, రైతులు శంకర్ పాల్గొనారు.


