ఆర్‌ఎంపీలు, పీఎంపీలను నియంత్రించండి
డీఎంహెచ్‌ఓకు ఐఎంఏ సభ్యుల వినతి
షాద్‌నగర్: ఆర్‌ఎంపీలు, పీఎంపీలను నియంత్రించాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సభ్యులు బుధవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఐఎంఏ షాద్‌నగర్ అధ్యక్షుడు డాక్టర్ నాగవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ను కలిసిన వైద్యులు ఎలాంటి అర్హత లేకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా షాద్‌నగర్‌లో ఆర్‌ఎంపీలు చికిత్సలు చేస్తున్నారని వారిని నియంత్రించాలని కోరారు. కేవలం ప్రథమ చికిత్సలు మాత్రమే నిర్వహించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు, ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్లు ఆయనకు వివరించారు. వారిని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతు వేదికకు కేటాయించిన భూమిని కాపాడండి
కందుకూరు: ప్రభుత్వం రైతు వేదిక నిర్మాణానికి కేటాయించిన భూమిలో కొంత మేర ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి ప్లాట్లు చేశారని.. సర్వే చేసి ఆ భూమిని కాపాడాలని కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్‌ను కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి, నాయకుడు ఎస్.శేఖర్‌గౌడ్ తదితరులు తహసీల్దార్ గోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు పిల్లి వాగును సైతం వెంచర్ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా మార్పులు చేశారన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెంట ఖదీర్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై
నిరంతర పోరాటం
జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి
ఆమనగల్లు: ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతర పోరాటం చేస్తోందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల బీజేపీ క్రియాశీల సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం బీజేపీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్తూ పార్టీ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్, మాజీ సభ్యుడు రాంరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ అధ్యక్షుడు కర్నాటి విక్రంరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చెక్కల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్‌లు విజయ్‌కృష్ణ, చెన్నకేశవులు, సుండూరి శేఖర్, కృష్ణనాయక్, కృష్ణయాదవ్, బీజేపీ నాయకులు రవిరాథోడ్, ప్రశాంత్, మహేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని సరెండర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సంధ్యారాణిని సరెండర్ చేస్తూ కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను మహిళాళా శిశు సంక్షేమ శాఖకు సరెండర్ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిగా పని చేస్తున్న శ్రీలతకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆర్‌ఎంపీలు, పీఎంపీలను నియంత్రించండి


