
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
షాద్‌నగర్‌రూరల్: పండుగలను అందరూ కలిసి మెలిసి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ రంగస్వామి అన్నారు. రంజాన్, ఉగాది పండుగలను పురస్కరించుకొని మంగళవారం షాద్‌నగర్ పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బుగ్గారెడ్డి గార్డెన్‌లో శాంతి సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రంజాన్, ఉగాది పండుగలు వెనువెంటనే ఉన్నందున హిందూ ముస్లింలు కలిసికట్టుగా జరుపుకోవాలని సూచించారు. పండుగల సమయంలో ఒకరినొకరు గౌరవించుకోవాలని, దీంతో అందరి మధ్య సోదర భావం మరింత పెంపొందుతుందని తెలిపారు. దేవాలయాలు, మసీదుల వద్ద పూజలు, ప్రార్థనలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సునీత, వివిధ పార్టీల నాయకులు బాబర్‌ఖాన్, అందె బాబయ్య, జమృత్‌ఖాన్, సర్వర్‌పాషా, చెంది మహేందర్‌రెడ్డి, ప్రశాంత్, ముక్తార్ అలీ, అన్వర్, అసద్ తదితరులు పాల్గొన్నారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య అధ్యక్షురాలు జయమ్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మన్, శానిటరీ వర్కర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు కనీస విద్యార్హత పదో తరగతి ఉండాలని, 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు ఈనెల 29వ తేదీ వరకు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య మెప్మా సెక్షన్‌లో దరఖాస్తులు అందజేయాలని ఆమె సూచించారు.
విద్యార్థుల ఉన్నతికి ఏఐ దోహదం
కేశంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేవిధంగా ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పాఠాలు బోధించేందకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం (ఎఫ్‌ఎల్‌ఎన్) జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి జయచంద్రరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొత్తపేట ప్రాథమిక పాఠశాలకు మంజూరైన ఎఫ్‌ఎల్‌ఎన్ సిస్టంను మంగళవారం మండల విద్యాధికారి చంద్రశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవ త్సరం నుంచి 3 నుండి 5వ తరగతి విద్యార్థులకు ఏఐ అభ్యాసన తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పాఠాలను అర్థ చేసుకొని సంభాషించి అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రంలో తమ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్పీలు శరత్‌చంద్ర, స్వప్న, ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, ఉపాధ్యాయులు లలితకుమారి, కళ్యాణి, శ్రీదేవి, స్రవంతి, మంజుల, సీఆర్పీలు రామకృష్ణ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
రూ.1.30 కోట్ల నగదు పట్టివేత
చాంద్రాయణగుట్ట: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1.30 కోట్ల నగదును చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ గురునాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్ జంక్షన్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అటుగా వచ్చిన కియా కారును నిలిపి తనిఖీ చేయగా మహ్మద్ యూసుఫుద్దీన్, సయ్యద్ అబ్దుల్ హదీల వద్ద రూ.1.30 కోట్ల నగదు లభ్యమైంది. డబ్బుకు సంబంధించిన వివరాలు కోరగా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మని, ల్యాండ్ కొన్నామని, అందుకు చెల్లించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. సరైన పత్రాలు చూపని కారణంగా ఐటీ అధికారులకు అప్పగించారు.