శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో అవసరాలకు తగినట్లు ఆర్థిక వనరులు లేకపోవడంతో ప్రజలకు సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సతమతమవుతున్నారు. ఇప్పటికే వేలల్లో విద్యుత్ దీపాల అవసరం ఉన్నప్పటికీ నిధుల కొరతతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. సుమారు 1,500 లైట్లకు ఆర్డర్ ఇచ్చి వాటి కోసం నాలుగు నెలలుగా వేచి చూస్తున్నారు. వీధి దీపాల కోసం నిత్యం మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. శంకర్‌పల్లి ప్రధాన చౌరస్తా నుంచి బుల్కాపూర్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసినా చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్తే తాత్కాలికంగా మరమమ్మతులు చేసి వదిలేస్తున్నారు.
రూ. 80లక్షలకు పైగా పెండింగ్ బిల్లులు
మున్సిపాలిటీలో మొత్తం 3,145 వీధి దీపాలు ఉన్నాయి. ప్రతీ నెల రూ.7లక్షలకు పైగా విద్యుత్ బిల్లు వస్తోంది. ఏడాది కాలంగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో బిల్లుల చెల్లింపు ప్రక్రియను నిలిపివేశారు. దీంతో రూ.80 లక్షలకు పైగా పెండింగ్ ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్ యంత్రాంగం ఎస్‌టీఓ చెక్కుల రూపంలో బిల్లుల చెల్లింపులు చేసినా.. నిధులలేమి కారణంగా అవి నిరుపయోగంగా మారాయి.
త్వరలో చెల్లిస్తాం
మున్సిపాలిటీలో విద్యుత్ బకాయిలు ఉన్న మాట వాస్తవమే. రానున్న వారం, పది రోజుల్లో పూర్తిగా చెల్లించేందుకు సిద్ధమయ్యాం. ఈ మేరకు ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాం. త్వరలో అవసరమైన చోట వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తాం.
– యోగేశ్, మున్సిపల్ కమిషనర్