షాద్‌నగర్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం వైద్యాధికారులు బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఇటీవల కేశంపేట మండలం కోనాయపల్లికి చెందిన సామ్యనాయక్(50)కు జ్వరం రావడంతో వారి కుటుంబ సభ్యులు పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆదివారం రాత్రి మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సామ్యనాయక్ మృతిచెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆస్పత్రిని తనిఖీ చేశారు. సామ్యనాయక్‌కు సంబంధించిన అడ్మిషన్ రిజిస్టర్, పేషంట్ ల్యాబ్ రిపోర్టులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సామ్యానాయక్‌కు వైద్యం చేసిన డాక్టర్లు సింధు, అఖిల్, ఫైజల్‌తో మాట్లాడి వివరాలు సేకరించి ఆస్పత్రిని సీజ్ చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి తగు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీయంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. తనిఖీలో పాల్గొన్న వారిలో డాక్టర్ నిఖిల్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఫార్మాసిస్టు ఉదయ్‌కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటముని ఉన్నారు.
బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి సీజ్