కేటుగాడు.. దొరికాడు
తప్పించుకు తిరుగుతున్న పాన్ బ్రోకర్‌కు రిమాండ్ రూ.కోటిపైగా విలువైన ఆభరణాలు కుదవ పెట్టుకున్న నిందితుడు 300 గ్రాముల బంగారం రికవరీ వివరాలు వెల్లడించిన సీఐ గంగాధర్
కడ్తాల్: మండల కేంద్రంతో పాటు, పరిసరా గ్రామాల ప్రజలు కుదువ పెట్టిన సుమారు రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలను తన సొంత అవసరాలకు వాడుకోవడంతో పాటు తప్పించుకు తిరుగుతున్న పాన్ బ్రోకర్‌ను పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బేవార్ జిల్లా జైతారం మండలం రామర్ గ్రామానికి చెందిన బర్ఫా నన్నారాం అలియాస్ నవీన్, అతని సోదరుడు ధర్మారామ్ కలిసి 2023లో ఉపాధి కోసం కడ్తాల్‌కు వచ్చారు. ఇక్కడ గణేశ్ పాన్ బ్రోకర్స్ పేరుతో లైసెన్స్ కలిగిన నగల తాకట్టు దుకాణాన్ని ప్రారంభించారు. పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది తమ బంగారు, వెండి ఆభరణాలు కుదవ పెట్టి డబ్బులు తీసుకునేవారు. ఈసమయంలో కస్టమర్లకు తక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చేవారు. అనంతరం అదే వస్తువులను మండల కేంద్రంలోని ముత్తూట్ ఫైనాన్స్‌తో పాటు సిక్రిందాబాద్‌లోని ఉత్తమ్‌చంద్‌కు చెందిన వివేక్ పాన్ బ్రోకర్స్ వద్ద కుదువ పెట్టి, ఎక్కువ డబ్బులు తీసుకునేవారు. వచ్చిన సొమ్ముతో తమ అవసరాలు తీర్చుకునే వారు. ఇలా ప్రజలు కుదువ పెట్టిన సుమారు 500 గ్రాముల బంగారంతో గత ఏడాది సెప్టెంబర్‌లో షాపును మూసేసి, కుటుంబ సభ్యులతో సహా పారిపోయారు. ఈ విషయమై అప్పట్లోనే సుమారు 25 మంది బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నన్నారాం ఈనెల 13న కందుకూరు మండలం పెద్దమ్మతండాకు వచ్చాడని పోలీసులకు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సికింద్రాబాద్‌లో కుదువ పెట్టిన సుమారు 300 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కుతరలించారు. ఇతని సోదరుడు ధర్మారామ్ పరారీలోనే ఉన్నాడు. వీరి నుంచి మరో 200 గ్రాముల బంగారం రికవరీ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే స్థానిక పీఎస్‌లలో ఫిర్యాదు చేయాలన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ గంగాధర్, ఎస్‌ఐ వరప్రసాద్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.


