2 జోన్లు.. 10 ఠాణాలు
మహేశ్వరం, శంషాబాద్ జోన్ల ఏర్పాటుకు నిర్ణయం భవిష్యత్ ట్రాఫిక్ రద్దీపై అధికారుల కసరత్తు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా ప్రయాణం త్వరలోనే వెలువడనున్న అధికారిక ఉత్తర్వులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీలో శాంతి భద్రతల పరిరక్షణ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కమిషనరేట్‌కు పటిష్టమైన ట్రాఫిక్ విభాగం ఏర్పాటు కానుంది. ఫోర్త్ సిటీలో భవిష్యత్ ట్రాఫిక్ రద్దీ, వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ జోన్లు, డివిజన్లు, ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. మహేశ్వరం, శంషాబాద్ రెండు ట్రాఫిక్ జోన్లలో నాలుగు డివిజన్లు, మొత్తం 10 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లతో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ విభాగం కొలువుదీరనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ట్రాఫిక్‌కు జాయింట్ సీపీ..
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, చలాన్ల జారీతో పాటు ఫ్యూ చర్ సిటీ ట్రాఫిక్ పోలీసు విభాగం సరికొత్తగా ఆవిష్కృతం కానుంది. ట్రాఫిక్ పోలింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చడం, సమర్థ పర్యవేక్షణ నిమిత్తం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌లో ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్ ఉండనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కొలువుదీరనున్న బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారుల రాకపోకలు ఎలాంటి అంతరాయం కలగకుండా సాఫీగా ప్రయాణం సాగించేలా ఈ విభాగం పని చేస్తుంది.
ఠాణాలివీ..
శంషాబాద్ ట్రాఫిక్ జోన్‌లో శంషాబాద్ డివిజన్, షాద్‌నగర్ డివిజన్లుంటాయి. ఈ రెండు డివిజన్లలో ఆరు ట్రాఫిక్ ఠాణాలు, మహేశ్వరం ట్రాఫిక్ జోన్‌లో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం డివిజన్లుంటాయి. వీటిలో నాలుగు ఠాణాలు ఉంటాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌లో శాంతి భద్రతల విభాగంలో మూడు జోన్లు ఏర్పాటైన సంగతి తెలిసిందే.
ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ విభాగంస్వరూపమిదీ
కమిషనరేట్ నేపథ్యమిదీ..
ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఇక్కడి నుంచే కమిషనరేట్ కార్యకలాపాలు సాగించనుంది. త్వరలోనే రంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో లేదా ప్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిధిలో గానీ కమిషనరేట్‌కు స్థలం కేటాయించనున్నారు. ఇప్పటికే అనువైన స్థలం కోసం రెవెన్యూ అధికారులు అన్వేషిస్తున్నారు. ఔటర్ రింగ్‌రోడ్ వరకూ జీహెచ్‌ఎంసీ విస్తరణతో ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి మధ్యలో ముచ్చెర్ల ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా ఫ్యూచర్ సిటీ పరిధి వరకు పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలోనే సైబరాబాద్, రాచకొండలోని పలు ప్రాంతాలను వేరు చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు.


