నేరెళ్ల బాల్యవివాహ రహిత గ్రామం | - | Sakshi
Sakshi News home page

నేరెళ్ల బాల్యవివాహ రహిత గ్రామం

Nov 27 2026 12:02 AM | Updated on Nov 27 2026 12:02 AM

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు మర్రిపల్లి చందన, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల/తంగళ్లపల్లి: బాల్య వివాహ రహిత గ్రామంగా నేరెళ్ల నిలవడంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు మర్రిపల్లి చందన, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అభినందించారు. ఏడాది కాలంగా నేరెళ్లలో ఒక్క బాల్య వివాహం కూడా కాకపోవడంతో సర్పంచ్‌ పొన్నం లక్ష్మణ్‌కు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. నేరేళ్లలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు, ప్రజలు కృషి చేయాలని కోరారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ మహిళా సంఘం(వీవో) భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలతో కలిగే నష్టాలపై విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. వీవో భవనాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సర్పంచ్‌ పొన్నం లక్ష్మణ్‌గౌడ్‌, సిరిసిసిల్ల ఏఎంసీ చైర్మన్‌ సత్తు శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌, జిల్లా విద్యాధికారి విజయ సాగర్‌, మండల ప్రత్యేక అధికారి, డీపీవో వీరభద్రయ్య, ఇంచార్జి తహసీల్దార్‌ మురళికృష్ణ, ఎంపీడీవో డి.రమేశ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మునిగెల రాజు పాల్గొన్నారు.

బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు. బద్దెనపల్లిలో నిర్వహిస్తున్న బీమా నమోదు శిబిరాన్ని పరిశీలించారు. సర్పంచ్‌ సిలివేరి లావణ్య, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎంపీడీవో రమేశ్‌, కార్యదర్శి రాజు పాల్గొన్నారు.

బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చుదాం

బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు మర్రిపల్లి చందన కోరారు. కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమశాఖ ఆద్వర్యంలో బాల్య వివాహాల నివారణపై ‘బాల్య వివాహం.. బతుకు ఆగం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతేలతో కలిసి పాల్గొన్నారు. బాల్య వివాహాల నివారణపై అందరితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. చందన మాట్లాడుతూ అన్ని మతాల పెద్దలు బాల్యవివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ మాట్లాడుతూ బాల్య వివాహం చేసే అందరికీ చట్టం ప్రకారం జైలు, జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు. 18 ఏండ్ల లోపు అమ్మాయి, 21 ఏండ్లలోపు అబ్బాయికి పెళ్లి చేయవద్దని సూచించారు. ఏడాది కాలంలో 12 బాల్య వివాహాలు అధికారులు అడ్డుకున్నారని తెలిపారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే మాట్లాడుతూ బాల్య వివాహాల సమాచారం 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement