మత్తులో హత్యలు.. పాత కక్షలతో భౌతిక దాడులు జిల్లాలో 113 రౌడీషీట్లు.. 394 హిస్టరీ షీట్లు జైలు నుంచి వచ్చినా మారని నేరస్తుల తీరు పాత నేరస్తుల కదలికలపై పోలీసుల నిరంతర నిఘా.. కౌన్సెలింగ్
ఒకప్పుడు భయంతో వెనక్కి తగ్గిన రౌడీయిజం.. ఇప్పుడు మళ్లీ పడగ విప్పుతోంది. చిన్నచిన్న వివాదాలకే దాడులు.. పాత కక్షలతో హత్యలు.. జైలు నుంచి బయటకు వచ్చినా మారని నేరప్రవృత్తి.. వెరసి జిల్లాలో శాంతిభద్రతలకు సవాల్‌గా మారుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 113 మంది రౌడీషీటర్లు, 394 మంది హిస్టరీ షీటర్లు ఉండటం నేరప్రవృత్తి తీవ్రతను చాటుతోంది. ఈ నేపథ్యంలో పాత నేరస్తుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. వారి ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేయడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ మరోసారి నేరాలకు పాల్పడకుండా హెచ్చరిస్తున్నారు.
సిరిసిల్ల: జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న పలు హత్యలు, దాడుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చందుర్తిలో 17 ఏళ్ల బాలుడు తొలుత హత్యకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం మరో మహిళను హత్య చేశాడు. సిరిసిల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమేశ్‌ను వేములవాడకు చెందిన యువకులు పథకం ప్రకారం హత్య చేశా రు. గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన సందీప్‌రెడ్డి భూవివాదంలో ఒకరిని హత్య చేసి, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మరో హత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటనల్లో నేరస్తుల ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
సోషల్ మీడియాలోనూ బెదిరింపులు
మరికొందరు యువకులు సోషల్ మీడియాలో తమను తాము రౌడీషీటర్లుగా ప్రచారం చేసుకుంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపినా వారి తీరు మారకపోవడంతో పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. ఓ యువకుడిపై పట్టణ బహిష్కరణ విధించారు.
పాత నేరస్తులపై నిఘా
జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలను పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నారు. ఇటీవల వారి ఇళ్లకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతోపాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నేరప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో జీవించాలని హెచ్చరిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు
జిల్లాలో పాత నేరస్తులు, రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించే వారికి పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని బైండోవర్ చేస్తాం.
– మహేశ్ బి. గితే, జిల్లా ఎస్పీ


