రైతుల చెమటకు తైబజార్‌ సెగ! | - | Sakshi
Sakshi News home page

రైతుల చెమటకు తైబజార్‌ సెగ!

Nov 24 2026 11:44 PM | Updated on Nov 24 2026 11:44 PM

● ఇష్టారాజ్యంగా డబ్బుల వసూలు ● లక్షల రూపాయల ఆదాయం ● వ్యాపారులకు వసతులు సున్నా

● ఇష్టారాజ్యంగా డబ్బుల వసూలు ● లక్షల రూపాయల ఆదాయం ● వ్యాపారులకు వసతులు సున్నా

కష్టపడి పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వస్తున్న రైతులకు తైబజార్‌ వసూళ్లు భారంగా మారాయి. మున్సిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌ సిబ్బంది ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారని, డబ్బులు తీసుకున్నా రశీదులు ఇవ్వడం లేదని రైతులు, చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా వ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కూరగాయలు విక్రయిస్తున్న రైతులు

అడిగినంత ఇవ్వాల్సిందే

ప్రతిరోజూ వేములవాడ మార్కెట్‌కు కూరగాయలు తీసుకొచ్చి అమ్ముకుంటాం. తైబజార్‌ సిబ్బంది అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు.

– మొండయ్య, రైతు, కాశాయపల్లి

ఏరోజూ రశీదు ఇవ్వలేదు

ఎన్నో ఏళ్లుగా కూరగాయలు అమ్ముకుంటున్నా తైబజార్‌ కాంట్రాక్టర్‌ ఎప్పుడూ రశీదు ఇవ్వలేదు. వారు ఎంత అడిగితే అంత చెల్లిస్తున్నాం. రశీదు అడిగితే అవసరం లేదని చెబుతున్నారు. – మల్లవ్వ, చిరువ్యాపారి, వేములవాడ

విచారణ జరిపి చర్యలు

తైబజార్‌ కాంట్రాక్టర్‌ సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతూ రశీదులు ఇవ్వడం లేదన్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. సంబంధిత అధికారులతో వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

– లోకేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, వేములవాడ

వేములవాడ రూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ తైబజార్‌ కాంట్రాక్టును సామల శ్రీవాణి రూ.21.30 లక్షలకు దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం వీధి వ్యాపారుల నుంచి నిర్ణీత మొత్తమే వసూలు చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్‌ సిబ్బంది అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రశీదులు అడిగితే దురుసుగా సమాధానమిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మహిళా వ్యాపారులు చెబుతున్నారు. పండుగల సమయంలో పూలు, ఇతర వస్తువులు విక్రయించేందుకు వచ్చిన గ్రామీణ రైతుల నుంచి రూ.100 నుంచి రూ.200కు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

కనీస వసతులూ కరువే

మరోవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా వ్యాపారాలు సాగిస్తున్నామని, తైబజార్‌ పేరుతో వసూళ్లు చేస్తున్న అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. అక్రమ వసూళ్లపై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement