వన్యప్రాణుల దాడులు.. అందని పరిహారం
మూగజీవాల మృత్యువాత జిల్లాలో ఆరు నెలల్లో పలు సంఘటనలు నివేదికతోనే చేతులు దులుపుకుంటున్న అధికారులు ఆందోళనలో పశువుల కాపరులు పరిహారం కోసం ఎదురుచూపులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతులకు పంటలకుతోడు పాడి ఉంటేనే ఆర్థికంగా స్థిరపడతారు. అయితే ఇటీవల జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లోని రైతులకు వన్యప్రాణుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. వేలకు వేలు పెట్టి ఆవులు, గేదెలు కొని పాలు విక్రయించి అప్పుల నుంచి గట్టెక్కుదామనుకుంటే వన్యప్రాణుల దాడులతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. విచారణ చేపడుతున్న ఫారెస్ట్ అధికారులు నివేదిక సమర్పించి చేతులు దులుపుకుంటున్నారు. బాధితులకు మాత్రం పరిహారం రావడం లేదు.
సంఘటనలు ఇలా..
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో అటవీ విస్తరించి ఉంటుంది. అటవీని ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇటీవల వన్యప్రాణుల దాడులు పెరిగాయి. అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఐదు చిరుతపులులు, పలు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. ఇటీవల ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట మండలాల్లో చిరుతల దాడుల్లో గేదెలు చనిపోయాయి. ఆరు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా జరిగిన పది సంఘటనల్లో లేగదూడలు మృతిచెందాయి. వీరిలో ఎవరికీ ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదు. ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల, గాలిపల్లి గ్రామాల్లో ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని గుంటపల్లిచెరువుతండాలో ఆరు నెలల్లో చిరుతల దాడిలో మూడు లేగదూడలు, ఎలుగుబంట్ల దాడిలో రెండు దూడలు చనిపోయాయి.


