జన జాతరకు వేళాయె
నేటి నుంచి సమ్మక్క– సారలమ్మ జాతర
ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి/కోనరావుపేట: జిల్లాలో నేటి నుంచి జరిగే సమ్మక్క– సారలమ్మ మహా జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారల గద్దెలను ముస్తాబు చేశారు. బుధవారం నుంచి ఈనెల 31వరకు నాలుగు రోజులపాటు వన దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 28, 29న గద్దెలపైకి అమ్మవార్లు రానుండగా మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి వన దేవతలకు ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించారు.
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో..
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ శివారు అటవీప్రాంతంలో సమ్మక్క, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేశారు. సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, పాలకవర్గం ఆధ్వర్యంలో జాతర కోసం తల్లుల గద్దెలను ముస్తాబు చేశారు. 20 ఏళ్లుగా ఇక్కడ వన దేవతల జాతర జరుగుతోంది. ఏర్పాట్లను మంగళవారం ఎస్సై రాహుల్‌రెడ్డి పరిశీలించారు. జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. భక్తులు పార్కింగ్ స్థలంలోనే వాహనాలు నిలిపేలా పంచాయతీ అధికారులు, పాలకవర్గం పోలీసులకు సహకరించాలని కోరారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువుతండా, శాంతినగర్‌లో సమ్మక్క, సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. కోనరావుపేట మండలం శివంగాలపల్లిలో వనదేవతల జాతరకు ఏర్పాట్లు పూర్తయినట్లు సర్పంచ్ అంబటి చైతన్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు శేఖర్ తెలిపారు.


