అదుపు తప్పిన కారు
● ఒకరు మృతి, నలుగురికి గాయాలు
తిమ్మాపూర్: మండలంలో ఎల్‌ఎండీ కాలనీలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐదు నిమిషాల్లో బందువుల ఇంటికి చేరతామనగా, వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన కుటుంబం హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. సోమవారం సాయంత్రం కారులో ఇంటి నుంచి తిమ్మాపూర్లోని వారి బంధువుల ఇంటికి బయల్దేరారు. ఎల్‌ఎండీ కాలనీ వద్దకు రాగానే లారీని తప్పించే ప్రయత్నంలో కారు కిందకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న కనకమెడల అరుణకుమారి (80) అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, తీవ్ర గాయపడిన నలుగురిని సమీప ఆసుపత్రికి తరలించారు. తిమ్మాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
బోయినపల్లి: మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పెంటి రాంప్రసాద్ (49) అనే ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ గుండెపోటుతో సోమవారం రాత్రి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయంత్రం ఇంటివద్దే ఒక్కసారి కుప్పకూలినట్లు తెలిపారు. రాంప్రసాద్ మృతదేహాన్ని మంగళవారం ఏపీడీ నర్సింహులు, ఎంపీడీవో భీమ జయశీల, ఈజీఎస్ ఏపీవో సబిత, కార్యదర్శి శేఖర్ తదితరులు సందర్శంచి నివాళి అర్పించారు. కుటంబీకులను ఓదార్చి రూ.20 వేలు ఆర్థికసాయంగా అందించారు. మృతుడికి భార్య శ్రీవాణి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. బాధిత కుటంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
పోలీసుల అదుపులో గంజాయి విక్రేత
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో హస్నాబాద్ గ్రామ శివారులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
సిరిసిల్లక్రైం: నమ్మకంగా కిరాణాషాపు నడుపుతూ పలువురి వద్ద రూ.2కోట్లు అప్పుగా తీసుకొని రెండునెలల క్రితం ఉడాయించిన వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధితులు తమ డబ్బును ఎలాగోలా రాబట్టుకునేందుకు సిరిసిల్లటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. వ్యాపారికి బాధితులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఓ జాతీయ పార్టీ నాయకుడు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సిరిసిల్ల టౌన్ పోలీసులను వివరణ కోరగా, వ్యాపారిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అదుపు తప్పిన కారు


