ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకరు మృతి
ఇబ్రహీంపట్నం: అంత్యక్రియలకు వెళ్లి ప్రమాదవశాత్తు కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. మండలకేంద్రానికి చెందిన జింక గంగాధర్(48) సోమవారం తమ కులానికి చెందిన ఒకరు మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లి పక్కనే ఉన్న కాకతీయ కాలువలో నీళ్లు చల్లుకునేందుకు మెట్లు దిగడంతో ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. గ్రామశివారులో మంగళవారం సాయంత్రం మృతదేహం దొరికింది. మృతుడి సోదరుడు జింక శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్సై నవీన్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు..
జగిత్యాలక్రైం: బీర్‌పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన దుంపెట వినోద్ (29) అనే యువకుడు మంగళవారం సాయంత్రం ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వినోద్ మంగళవారం ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వెళ్లాడు. దున్ని తిరిగి వస్తుండగా సాయంత్రం ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో బోల్తాపడగా వినోద్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బీర్‌పూర్ ఎస్సై రాజు తెలిపారు.
స్వగ్రామానికి మృతదేహం
రాయికల్: మండలంలోని అల్లీపూర్‌కు చెందిన పడాల గంగారెడ్డి (47) అనే గల్ఫ్ కార్మికుడు ఈనెల 6న సౌదీలో గుండెపోటుతో మృతిచెందగా, మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరింది. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. గల్ఫ్ కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.
ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకరు మృతి


