అన్ని వర్గాల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

Jan 17 2026 7:40 AM | Updated on Jan 17 2026 7:40 AM

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

● పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క

వేములవాడఅర్బన్‌: అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. రూ.కోటితో చేపట్టే వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూర్‌ జంక్షన్‌ అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ రాజన్న ఆలయ విస్తరణకు రెండు బడ్జెట్‌లలో కలిపి రూ.150 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళలు సంఘాల్లో చేరి, వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు సిరిసిల్లకే కేటా యించామని గుర్తు చేశారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఒకే సంస్కృతి ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కలిసి సీఎంను కలుస్తామని చెప్పారు.

టెంపుల్‌సిటీగా చేస్తాం : విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడను టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రూ.47కోట్లతో రోడ్డు వెడల్పు పనులు చేపట్టామన్నారు. మల్లారం జంక్షన్‌ నుంచి బతుకమ్మ తెప్ప, బ్రిడ్జి మీదుగా జగిత్యాల బస్‌స్టాండ్‌(సాయిరక్ష) వరకు మొత్తం 3.6 కిలో మీటర్ల పరిధిలో 146 విద్యుత్‌ స్తంభాలతో సుందరీ కరణ పనులకు సుమారు రూ.2.65కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని 28 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయన్నారు. నాంపల్లిగుట్ట నుంచి సంకెపల్లి వరకు పాత రోడ్డు, కోనాయపల్లి–కాషాయపల్లి మధ్యలో రోడ్డు, బాలానగర్‌–శాత్రాజుపల్లి మధ్యలో కల్వర్టు, రుద్రంగి, భీమారం మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలు నిర్మించాలని మంత్రి సీతక్కను కోరారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, వేములవాడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌ చైర్మన్‌ రాకేశ్‌, గ్రంథాలయసంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేశ్‌, ఆర్డీవో రాధాభాయ్‌, తహసీల్దార్‌ విజయ ప్రకాశ్‌రావు ఉన్నారు.

పెండింగ్‌ బిల్లులు ఇప్పించండి

సిరిసిల్ల: ఇందిరా మహిళా శక్తి చీరలను ఉత్పత్తి చేసిన మ్యాక్స్‌ సంఘాలకు పెండింగ్‌ బిల్లులను ఇప్పించాలని సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు రాష్ట్ర మంత్రి సీతక్కను కోరారు. వేములవాడకు వచ్చిన సందర్భంగా మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా బిల్లులు విడుదల చేయించాలని, రెండో విడత చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వాలని సిరిసిల్ల పాలిస్టర్‌ వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఆడెపు భాస్కర్‌, వస్త్రోత్పత్తిదారులు వేముల దామోదర్‌, బూట్ల నవీన్‌ కుమార్‌ కోరారు.

రుద్రంగిని మోడల్‌గా తీర్చిదిద్దుతా

రుద్రంగి(వేములవాడ): రుద్రంగిని మోడల్‌ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్‌, విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సర్వ శిక్ష నిధులు రూ.48.60లక్షలతో నిర్మించిన మండల రిసోర్స్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జీపీలో 21 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రుద్రంగిలో పలు ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్‌ భవనాన్ని త్వరలోనే నిర్మిస్తామన్నారు. యువతలో నైపుణ్య అభివృద్ధికి శిక్షణ అందించే అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ పనులు త్వరలోనే మొదలు పెడతామన్నారు. సూరమ్మ నిర్వాసితులకు త్వరలోనే నష్టపరిహారం పంపి ణీ చేస్తామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుంచి నియోజకవర్గానికి త్వరలోనే సాగునీటిని విడుదల చేయిస్తానని పేర్కొన్నారు. విద్యుత్‌ సమస్యలు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. సర్పంచ్‌ నారాయణ, వేములవాడ ఆర్డీవో రాధాభాయి, డీఈవో వినోద్‌కుమార్‌, టీజీ ఈడబ్ల్యూ ఐడీసీ ఈఈ అశోక్‌కుమార్‌, డీఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement