జాతరకు సిద్ధం
కోనరావుపేట(వేములవాడ): రాజన్న ఆలయం దత్తత కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం నుంచి మాఘ అమావాస్య జాతర ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం వేములవాడ ఆలయ అధికారులు, పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18న మామిడిపల్లి ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ జాతర ఉత్సవాలకు సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలతోపాటు నిజామాబాద్ జిల్లా సిరికొండ నుంచి భక్తులు హాజరవుతారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఇక్కడే వంటావార్పు చేసుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ఇందుకోసం జాతర మైదానాన్ని ట్రాక్టర్లతో శుభ్రం చేయించారు. సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, కార్యదర్శి సతీశ్ ఆధ్వర్యంలో దు కాణాలకు స్థలాలు కేటాయించారు. మండలంలోని నాగారంలోని కోదండ రామస్వామి ఆలయం, ధర్మారంలోని శ్రీవేంకటేశ్వరస్వామి, కొలనూర్‌లోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్నదానం చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.


