సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టొద్దు
● ఆర్వోఎఫ్‌ఆర్ భూసమస్యలు పది రోజుల్లో పరిష్కరించాలి ● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సిరిసిల్ల: జిల్లాలో షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధికి మంజూరయ్యే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుశ్రము నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్‌లతో కలిసి కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో 4,313 ఎకరాల భూమికి సంబంధించి 6,029 మంది రైతులు పోడుపట్టాలకు దరఖాస్తు చేసుకోగా 1,614 మందికి 2,860 ఎకరాలు పంపిణీ చేశారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆర్వోఎఫ్‌ఆర్ భూసమస్యను పది రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలకు రూ.1.08 కోట్లు సింగరేణి నుంచి రావాలని అధికారులు వివరించగా.. సీఎండీతో మాట్లాడుతామని స్పష్టం చేశారు. సబ్సిడీ రుణాలను మంజూరు చేసి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరణాలు లేకుండా మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాలను విజయవంతంగా నిర్వహించడంపై చైర్మన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందించారు.
సోలార్ ప్యానల్ ఫెన్సింగ్‌లకు ప్రతిపాదించండి
స్కూళ్లు, హాస్టళ్లలో పిల్లల రక్షణకు కుక్కలు, కోతుల సమస్య పరిష్కారానికి సోలార్ ప్యానల్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఏడు రోజుల్లో సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో డైట్‌మెనూ అందించాలని, స్టడీసర్కిల్‌లో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. స్వయం ఉపాధి కల్పనలో రాజీవ్ యువవికాసం ద్వారా ఎస్సీ, ఎస్టీ యువతకు రుణాలు అందించాల న్నారు. ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ కోసం నిధుల మంజూరుకు కృషి చేస్తామని వివరించారు.
అట్రాసిటీ కేసుల్లో..
మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై 233 ఫిర్యాదులు రాగా 233 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 136 చార్జిషీట్ దాఖలు చేశామని అధికారులు వివరించారు. జిల్లాలో పెండింగ్ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అట్రాసిటీ కేసుల్లో చార్జిషీట్ దశలో 57 మందికి రూ.1.28 లక్షల పరిహారం చెల్లించామని, ఇంకా మిగిలిన 194 మంది బాధితులకు చెల్లించాల్సిన రూ.1.45 కోట్లు త్వరగా మంజూరు చేసేలా శ్రద్ధ చూపాలన్నారు. ఉపాధిహామీలో ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం పని కల్పించాలని కోరారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేసుతన్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వివరించారు. ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం భూమి కేటాయించామని.. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఎస్పీ మహేశ్ బీ.గీతే, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో రాధాభాయి, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


