పోదాం పదా జాతర
మూడు జాతర్లకు ముస్తాబైన కార్మికక్షేత్రం బుగ్గరాజేశ్వరస్వామి వద్ద ప్రత్యేక బస్సులు మానేరు తీరం.. మాఘమాసం ప్రత్యేకం
సిరిసిల్లటౌన్/సిరిసిల్లకల్చరల్: మానేరుతీరం.. జాతరలకు సిద్ధమైంది. జిల్లాలో మాఘ అమావాస్య సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కార్మికక్షేత్రంలో గంగాభవాని, మడేలేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి జాతరలు, ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో బుగ్గరాజేశ్వరస్వామి, కోనరావుపేట మండలం మామిడిపల్లి, నాగారం, గంభీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేట గ్రామాల్లోని ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
సిరిసిల్లలో మూడు జాతర్లు
సిరిసిల్లలోని మానేరుతీరంలో మాఘ అమావాస్య రోజున మూడు జాతర్లు జరుగుతుంటాయి. గంగమ్మ ఆలయంలో గంగపుత్రులు, పట్టణ శివారులోని రామప్ప(ప్రస్తుతం మిడ్‌మానేరు ముంపులో ఉంది) ఆలయంలో నాయీబ్రాహ్మణులు, మానేరు తీరాన వెలసినన మడేలేశ్వర ఆలయంలో కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. సిరిసిల్ల పట్టణ శివారు గుట్టల్లో రామప్పగుడిలో రామలింగేశ్వరస్వామి కల్యాణాన్ని నాయీబ్రాహ్మణులు నిర్వహిస్తారు. కాకతీయుల కాలంలో మొఘలాయిలు హిందూ ఆలయాలపై దాడి చేసిన సమయంలో ఈ ఆలయం కూడా శిథిలమైందని చరిత్ర చెబుతుంది. ప్రస్తుతం ఈ గుడి మిడ్‌మానేరు ముంపు జలాల్లో మునిగిపోవడంతో సమీప ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో పునర్‌నిర్మించారు. మానేరు నది మధ్యలో ఉన్న గంగమ్మ ఆలయంలో గంగపుత్రులు అమ్మవారి కల్యాణం ఏటా నిర్వహిస్తారు. సిరిసిల్ల మానేరు నది తీరంలో రజకసంఘం ఆధ్వర్యంలో మూడున్నర దశాబ్దాల క్రితం మడేలేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఏటా శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నారు. జాతరకు దాదాపు రూ.10లక్షలతో ఏర్పాట్లు చేశారు. మానేరు నది విద్యుత్‌దీపాలతో వెలిగిపోతుంది.
పోదాం పదా జాతర


