గుండారంలో తాగునీటి కష్టాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని గుండారం గ్రామంలోని పోచమ్మతండాలో వేసవికి ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండాకాలం రాకముందే తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదని శనివారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. రోడ్డుపై ఖాళీ బిందెలు పెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వ బోరు వేయించి ఏడాదిన్నర కాలమైనా మోటార్ బిగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ వెంటనే బోరు మోటార్ బిగించి నీటి కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రతీ వేసవిలో వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు. తండా జనాభాకనుగుణంగా బోర్లు వేయాలని కోరినా పట్టింపు లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ ముడావత్ సరోజన మాట్లాడుతూ పోచమ్మతండాలో గతంలో వేసిన బోరుకు వెంటనే మోటారును బిగిస్తామన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా అధికారులతో మాట్లాడుతామన్నారు. వేసవికి ముందే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
గుండారంలో తాగునీటి కష్టాలు


