రిజర్వేషన్లు ఖరారు | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు ఖరారు

Jan 18 2026 7:00 AM | Updated on Jan 18 2026 7:00 AM

రిజర్వేషన్లు ఖరారు

రిజర్వేషన్లు ఖరారు

రాజన్న సిరిసిల్ల

అత్యధికంగా ఓసీ స్థానాలే

ఉమ్మడి జిల్లాలో 15 పురపాలికలకు ప్రకటన

5 బీసీ, 4 ఎస్సీ, 6 ఓసీలకు కేటాయింపు

అత్యధికంగా ఓసీ అభ్యర్థులకు అవకాశం

కరీంనగర్‌ కార్పొరేషన్‌ బీసీ జనరల్‌, రామగుండం ఎస్సీ జనరల్‌

రాజన్న సిరిసిల్ల

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

పురపాలిక ఎన్నికలకు కీలక అడుగు పడింది. ఇటీవల వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారైన దరిమిలా తాజాగా మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 పురపాలికలు న్నాయి. అందులో 13 మున్సిపాలిటీలు కాగా, 2 కార్పొరేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో అన్ని ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నస్థాయిలో పోటీ నెలకొంది. మేయర్‌, మున్సి పల్‌ చైర్మన్ల ఆశావహులు సంబరాలు చేసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పుడెప్పుడు కదన రంగంలోకి దూకుదామా అన్న ఉత్సాహంతో ఉన్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ బీసీ జనరల్‌గా ప్రకటించడం, ఇక్కడ ప్రధాన పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేతలంతా బీసీలే కావడం గమనార్హం. మంత్రి పొన్నం ప్రభాకర్‌(కాంగ్రెస్‌), కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌(బీజేపీ), మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌(బీఆర్‌ఎస్‌) ముగ్గురూ బలమైన బీసీ సామాజికవర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. ముగ్గురూ కరీంనగర్‌ కార్పొరేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గ్రేటర్‌ హై దరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌ తరువాత అంతటి ప్ర తిష్టాత్మక కార్పొరేషన్‌ కావడంతో సహజంగానే అందరి కళ్లు కరీంనగర్‌ కార్పొరేషన్‌ మీదనే ఉంటాయి.

పార్టీల సర్వేలు పూర్తి.. అభ్యర్థుల ఆశల తలకిందులు

ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 పురపాలికలు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌ కార్పొరేషన్‌, జమ్మికుంట, చొప్పదండి, హుజూరాబాద్‌ మున్సిపాలిటీలు ఉండగా... రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలలో జగిత్యాల, ధర్మపురి, రాయికల్‌, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. పెద్దపల్లిలో సుల్తానాబాద్‌, పెద్దపల్లి, మంథని, రామగుండం కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం 15 పురపాలికల్లో ఇప్పటికే ఇంటలిజెన్స్‌ సర్వేతోపాటు, కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజల నాడీ తెలుసుకునేందుకు ఇప్పటికే సర్వే చేసుకున్నాయి. తమ విజయావకాశాలు ఆశావహులు, అభ్యర్థుల బలాబలాలపై ఇప్పటికే అన్నిపార్టీలు నివేదికలు తెప్పించుకున్నాయి. క్షేత్రస్థాయిలో తమకు అనుకూల, ప్రతికూల పరిస్థితులపై ఇప్పటికే అంచనాకు వచ్చాయి. అదే సమయంలో ప్రతీ చోటా పోటీ చేద్దామనుకున్న తాజా మాజీలకు పలుచోట్ల రిజర్వేషన్లు ప్రతికూలంగా మారాయి. అన్ని పార్టీల నేతలంతా సామాజిక సమీకరణాలు కుదిరి, మహిళలకు సీట్లు కేటాయించిన స్థానాల్లో తమ భార్యలు, తల్లులు, ఇతర కుటుంబ సభ్యులను నిల్చోబెట్టే యత్నాల్లో ఉండగా.. ఇక సామాజిక సమీకరణాలు అసలు కుదరని చోట డిప్యూటీ మేయర్‌ స్థానంతోనైనా సరిపెట్టుకోవాలని ఆశ పడుతున్నారు.

అంచనాలు తారుమారు

సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ గెజిట్‌ విడుదల చేశారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 39 వార్డులు, వేములవాడ పరిధిలోని 28 వార్డులకు రిజర్వేషన్లను శనివారం రాత్రి ప్రకటించారు. మారిన రిజర్వేషన్లతో కౌన్సిలర్‌, చైర్‌పర్సన్‌ స్థానాలపై ఆశలు పెట్టుకున్న ఆశావహుల అంచనాలు తారుమారయ్యాయి. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా మరోసారి మహిళలకు చాన్స్‌ లభించింది. గతంలో బీసీ మహిళకు అవకాశం రాగా.. ఈసారి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో మహిళలకు కేటాయించిన వార్డులకు డిమాండ్‌ పెరిగింది.

13 మంది సిట్టింగులకు నో చాన్స్‌

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో 13 మంది సిట్టింగ్‌ కౌన్సిలర్లకు చాన్స్‌ లేకుండా పోయింది. మారిన రిజర్వేషన్లతో ఆ కౌన్సిలర్లు మళ్లీ పోటీ చేసే అవకాశం లేదు. 1వ వార్డులో పోచవేని సత్య, 6లో గుండ్లపల్లి రామానుజం, 7లో భూక్యా రెడ్డినాయక్‌, 8లో చెన్నమనేని కీర్తి, 9లో లింగంపల్లి సత్యనారాయణ, 10లో బొల్గం నాగరాజు, 12లో పాతూరి రాజిరెడ్డి, 22లో కల్లూరి లత, 29లో గెంట్యాల శ్రీనివాస్‌, 30లో వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, 36లో కల్లూరి రాజు, 38లో గూడూరి భాస్కర్‌, 39వ వార్డులో ఆకుల కృష్ణకు రిజర్వేషన్లు కలిసిరాలేదు. అయితే కొన్ని స్థానాల్లో భార్యను లేదా కుటుంబంలోని మహిళలను పోటీలో ఉంచే అవకాశం వచ్చింది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 15 పురపాలికల్లో 5 చోట్ల బీసీలు, 4 చోట్ల ఎస్సీలు, 6 చోట్ల అన్‌రిజర్వ్‌డ్‌ (ఓసీ) వర్గాలకు అవకాశం కల్పించారు. కీలకమైన కరీంనగర్‌ కార్పొరేషన్‌ బీసీ జనరల్‌, రామగుండం కార్పొరేషన్‌ ఎస్సీ జనరల్‌కు కేటాయించడం గమనార్హం. ఈ రెండు స్థానాల్లో గెలవడం ఏ పార్టీకై నా అనుకున్నంత సులువేమీ కాదు. కరీంనగర్‌లో మిగిలిన జమ్మికుంట ఎస్సీ జనరల్‌కు, హుజూరాబాద్‌, చొప్పదండి మున్సిపాలిటీలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. జగిత్యాలలో అత్యధికంగా ఓసీలకు అవకాశం కల్పించారు. జగిత్యాల మున్సిపాలిటీ బీసీ (మహిళ)లకు కేటాయించగా, కోరుట్ల, ధర్మపురి మున్సిపాలిటీలు ఓసీ (మహిళ)లగా నిర్ణయించారు. రాయికల్‌, మెట్‌పల్లి మున్సిపాలిటీలు పూర్తి అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించి అన్ని వర్గాలకు పోటీ చేసుకునే వీలు కల్పించారు. సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ జనరల్‌ (మహిళ)కు కేటాయించగా, వేములవాడ మాత్రం బీసీ (జనరల్‌) అవకాశం కల్పించారు. పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీలు బీసీ (జనరల్‌)కు కేటాయించగా, సుల్తానాబాద్‌ పూర్తిస్థాయిలో అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement