భూములు బీళ్లుగానే..
● గిరివికాసంపై అవగాహన కరువు ● ప్రచారం చేయని అధికారులు ● పథకం గురించి తెలియక నష్టపోతున్న గిరిజనులు ● జిల్లాలో ఇప్పటి వరకు 7 యూనిట్లే మంజూరు ● ఇందులోనూ ఇద్దరి బిల్లులు పెండింగ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరివికాసం క్షేత్రస్థాయిలో సరిగా అమలుకావడం లేదు. 2018లో ప్రవేశపెట్టిన ఈ పథకంలో ఇప్పటి వరకు ఏడు యూనిట్లు మాత్రమే మంజూరుకావడం దీనికి నిదర్శనం. జిల్లాలో గిరి వికాసం పథకం అమలుతీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
పథకం అమలు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం 2018లో ముఖ్యమంత్రి గిరివి కాసం(సీఎంజీవీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజనుల భూములను సాగులోకి తేవడం ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా ఇద్దరు ఆపైన గిరిజన రైతులు కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడితే ఐదు ఎకరాలు ఆపైన భూములకు ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఆ భూములను సాగులోకి తేవడానికి ఉచితంగా బోరుబావి తవ్వించడం, మోటార్ బిగించడం, విద్యుత్ కనెక్షన్ ఇప్పించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కోసం డీఆర్డీఏ ఆఫీస్‌లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును వారు స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి సర్వే కోసం పంపిస్తారు. మండల కమిటీలోని అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులా.. కాదా.. అని నిర్ణయిస్తే అప్పుడు యూనిట్ మంజూరవుతుంది.
ఏడేళ్లలో ఏడు యూనిట్లే !
ముఖ్యమంత్రి గిరివికాసం పథకాన్ని ప్రవేశపెట్టి ఏడేళ్లు గడుస్తుండగా ఏడు యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. ఇందులో ఇంకా ఇద్దరికి బి ల్లులు మంజూరు కావాల్సి ఉంది. పథకం గురించి క్షేత్రస్థాయిలో గిరిజనులకు అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడం లేదు. గిరిజ నశాఖ అధికారులు తండాల్లో ఎలాంటి అవగాహ న కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో వారి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి తెలియడం లేదు. పథకం ఉన్నట్లు తెలిసినా ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏయే ఆఫీ స్‌లలో కలవాలి.. అనే విషయాలు తెలియక గిరి జనులు లబ్ధి పొందలేకపోతున్నారు. ఫలితంగా గిరిజనుల భూములు బీళ్లుగానే మిగిలిపోతున్నాయి.


