‘అయ్యా.. నా భూమి ఇప్పించండి’
రుద్రంగి: ‘అయ్యా నన్ను బతికుండగానే చంపేశారు. చనిపోయిందని దొంగ సంతకాలు పెట్టి కొందరు దళారులు నా వ్యవసాయ భూమిని కాజేశారు. మళ్లీ నా భూమి నాకు పట్టా చేయించుకుందాం అంటే ఆఫీసుల చుట్టూ తిరగడానికి కూడా చిల్లిగవ్వలేని పేదదాన్ని. నా భూమి నాకు ఇప్పించి నాకు న్యాయం చేయాలి’ అని వేడుకుంటున్న ఈ వృద్ధురాలి పేరు నందగిరి కమలవ్వ. రుద్రంగికి చెందిన ఈ వృద్ధురాలికి సర్వే నంబర్ 176/51లో ఒక ఎకరం భూమి వారి తాత, ముత్తాతల నాటి నుంచి సంక్రమించింది. అట్టి భూమిపై ఇటీవల కొందరు దళారులు కన్నేశారు. కమలవ్వ గతంలోనే భూమి అమ్మినట్టు దొంగ అమ్మకపు పత్రం సృష్టించారు. ఆమె బతికి ఉండగానే చనిపోయిందని దొంగ సంతకాలు పెట్టి అధికారులను నమ్మించి మోసం చేసి ఆమె భూమిలో నుంచి 22గుంటల భూమిని దళారుల పేరుపై ఎక్కించుకున్నారని వాపోయింది. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఈ విషయంపై రుద్రంగి తహసీల్దార్ శ్రీలతను వివరణ కోరగా ముందు అధికారులు పట్టా చేసి ఉంటారని, తాము ఎలాంటి అక్రమ పట్టాలు చేయలేదన్నారు. బాధితురాలు దరఖాస్తు చేసుకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


