సిరిసిల్ల: జిల్లాలో శనివారం సాయంత్రం వడగళ్ల వాన పడింది. కోనరావుపేట, చందుర్తి, వీర్నపల్లి మండలాల్లో ఓ మోస్తరు రాళ్లవాన పడింది. రాళ్లవానలతో పొట్టదశలో ఉన్న వరి పొలాలకు, మామిడితోటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. సిరిసిల్ల పట్టణంలో తుంపరతో కూడిన జల్లు కురిసింది. జిల్లా అంతటా అకాల వర్షాలు కురిశాయి.
కోనరావుపేట: మండలంలోని గొల్లపల్లి (వట్టిమల్ల), భుక్యారెడ్డితండా, కనగర్తి, సుద్దాల గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. గొల్లపల్లికి చెందిన సుంక భూమయ్య, దుప్యా నాయక్, వంకాయల రమేశ్, శ్రీనివాస్ తదితర రైతుల పంటలు దెబ్బతిన్నాయి.
ముస్తాబాద్: మండలంలోని బందనకల్, వెంకట్రావుపల్లి, మొర్రాపూర్ తండాల్లో వడగండ్ల వాన కురిసింది. బందనకల్‌లో వరిపంట దెబ్బతిందని రైతులు రమేశ్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తెలిపారు. మొర్రాపూర్‌లో వడగండ్లకు పొట్టదశకు వచ్చిన వరి దెబ్బతిందని రైతు కపూర్‌నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. బందనకల్‌లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి.
ఇల్లంతకుంట: మండలంలోని రామాజీపేట, ఓబులాపూర్‌లో రాళ్లతో కూడిన వర్షం పడింది. గాలిపల్లి, ఇల్లంతకుంట, వల్లంపట్ల, అనంతారం గ్రామాల్లో వర్షం అరగంటపాటు కురిసింది. కోతకు వచ్చిన పంటపొలాలు దెబ్బతిన్నాయి.
రుద్రంగి(వేములవాడ): వడగండ్ల వానకు మండలంలోని మామిడితోటలకు తీవ్ర నష్టం జరిగింది. కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి.
పంటనష్టంపై అధికారుల సర్వే
చందుర్తి/వీర్నపల్లి: చందుర్తి మండలం సనుగుల, జోగాపూర్, మల్యాల, చందుర్తి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయాధికారి అనూష, ఆర్‌ఐ శ్రీనివాస్, ఏఈవోలు శనివారం సర్వేచేశారు. వర్షానికి మండలంలోని సనుగులలో 35, జోగాపూర్‌లో 25, మల్యాలలో 20, చందుర్తిలో 10 ఎకరాలలో వరిపంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. వీర్నపల్లి మండలం శాంతినగర్‌లో మండల వ్యవసాయాధికారి జయ పరిశీలించారు. ఏవో మాట్లాడుతూ 35 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. రైతులు లక్పతినాయక్, తిరుపతి, మోహన్, రాజు ఉన్నారు.
వడగండ్లు మిగిల్చిన క డగండ్లు
వడగండ్లు మిగిల్చిన క డగండ్లు