తమిళనాడు బంగారు వ్యాపారులను కిడ్నాప్ చేసి దోచుకున్న కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: బంగారం వ్యాపారిని కిడ్నాప్ చేసి దోపిడీకి పాల్పడిన కేసులో సూత్రధారి అతని బావమరిదేనని పోలీసులు తేల్చారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి వివరాలను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు శనివారం విలేకరులకు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన బాలాజీ, ఆయన కుమారుడు శరవణ్‌లు కలిసి బంగారు వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఆర్డర్ మీద బంగారు ఆభరణాలు తయారు చేయించి ఒంగోలులోని బంగారు దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. గతంలో బాలాజీ ఆయన బావమరిది నాగరాజుతో కలిసి బంగారు వ్యాపారం చేశారు. అయితే వ్యాపారంలో నష్టాలపాలైన నాగరాజు అప్పులపాలయ్యాడు. అదే సమయంలో బాలాజీ మాత్రం లాభాలు గడించాడు. ఆర్డర్ల మీద నగలు తయారు చేయించి ఒంగోలులోని బంగారు దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు. దాంతో బావమరిది నాగరాజు సొంత బావమీదనే కన్నేశాడు. ఎలాగైనా సరే ఆయన వద్ద ఉన్న బంగారం కాజేయాలని పథకం పన్నాడు. అనుకున్నట్లుగానే తన స్నేహితులు 13 మందితో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాడు. తన స్నేహితుడు దేవరాజ్ సహకారంతో రమేష్, సమీర్, ఖాజా హుసేన్, రాం కుమార్ తదితరులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. నకిలీ నంబరు ప్లేటుతో ఇన్నోవా కారును సిద్ధం చేసి పెట్టాడు. ఈనెల 3వ తేదీ తమిళనాడులోని కోయంబత్తూరులో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కిన బాలాజీ, ఆయన కుమారుడు 4వ తేదీ తెల్లవారుజామున గం.5.30కు ఒంగోలు రైల్వే స్టేషన్‌లో దిగారు. బాలాజీని వెంబడించిన ముఠా సభ్యులు ఉపాస్ హాస్పిటల్ వద్దకు రాగానే కిడ్నాప్ చేశారు. కారులో కత్తులతో బెదిరించడమే కాకుండా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారి వద్ద ఉన్న 504 గ్రాముల బంగారం, 22 చైన్లు దొంగిలించారు. సౌత్ బైపాస్‌లోని సంఘమిత్ర హాస్పిటల్ వద్ద వారిని కారులోంచి బయటకు నెట్టేసి పారిపోయారు.
టెక్నాలజీ సహకారంతో నిగ్గుతేల్చి...
బాలాజీ వద్ద ఉన్న బంగారు నగలను దోచుకున్న దొంగలు నెల్లూరు వైపు పారిపోవడంతో పోలీసులు ముందుగా అటువైపు నుంచే దర్యాప్తు మొదలుపెట్టారు. మార్గం మధ్యలో టోల్‌ప్లాజాలు తగలకుండా నెల్లూరు చేరుకున్న దొంగల ముఠా అక్కడ బంగారు నగలను పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలో బంగారు ఆభరణాలను విక్రయించి సొమ్ము చేసుకునేందుకు బయలుదేరినట్లు శనివారం పోలీసులకు సమాచారం వచ్చింది. వారిని వెంబడించిన పోలీసులు ఒంగోలు సమీపంలోకి రాగానే అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరీ సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీలో మొత్తం 13 మంది పాల్గొనగా ప్రస్తుతం ఆరుగురు పట్టుబడ్డారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పీ హర్షవర్థన్ రాజు అభినందించారు.


