త్రిపురాంతకంలో పచ్చ భక్తిని చాటుకున్న ఆర్వో | - | Sakshi
Sakshi News home page

త్రిపురాంతకంలో పచ్చ భక్తిని చాటుకున్న ఆర్వో

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

బీసీలకు కేటాయించిన వార్డులో ఎస్సీల నామినేషన్‌లు ఆమోదం గుర్తులు కూడా కేటాయించి చేతులు దులుపుకున్న వైనం

యర్రగొండపాలెం: మెడలో పసుపు కండువా వేసుకొని వెళ్లిన వారి నామినేషన్లు స్వీకరించడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా ఆ నామినేషన్లు ఆమోదించడంతోపాటు గుర్తులు కూడా కేటాయించి కూటమి నాయకులతో శభాష్‌ అనిపించుకునేందుకు ఆర్వోలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం పంచాయతీలోని 6వ వార్డు బీసీ మహిళకు కేటాయించారు. ఈ వార్డులో మొత్తం ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పత్రాలు స్వీకరించిన ఆర్వో పరిశీలన సమయంలో ఆ పత్రాలు సక్రమంగా ఉన్నాయా, రిజర్వేషన్లకు సంబంధించి తహసీల్దార్‌ మంజూరు చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఉందా అనేది చూసుకోవాల్సి ఉంది. తగిన పత్రాలు లేకుంటే ఆర్వో ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చు. కానీ రాజుపాలెంలోని 6వ వార్డు సభ్యురాలిగా వైఎస్సార్‌ సీపీ మద్దతుతో వ్యవసాయ కూలి పనులు చేసుకునే బీసీ మహిళ చల్లా నాగమ్మ తన కుల ధ్రువీకరణ పత్రంతో నామినేషన్‌ దాఖలు చేసింది. ఆ నామినేషన్‌ను ఏదో ఒక రకంగా తిరస్కరించేందుకు ఆర్వో తీవ్ర ప్రయత్నం చేశాడు. ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలు అన్నీ సక్రమంగా ఉండటం వలన స్క్రూట్నీలో తొలగించలేకపోయాడు. గౌను గుర్తుకూడా కేటాయించాడు. టీడీపీ మద్దతుతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొట్టిముక్కల చిన్న పిచ్చమ్మ, చిలకపాటి బాలమ్మలు 6వ వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బీసీలకు కేటాయించిన వార్డులో ఎస్సీలు ఏ విధంగా నామినేషన్లు వేస్తున్నారన్న ఆలోచన కూడా లేకుండా ఆర్వో కేవలం వారి మెడలో ఉన్న పచ్చ కండువాలు చూసి ఆ నామినేషన్లు స్వీకరించారు. స్క్రూట్నీ సమయంలో వాటిని తొలగించినట్లయితే వైఎస్సార్‌ సీపీ మద్దతుతో పోటీ చేసిన నాగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించాల్సి వస్తుంది. ఆ విధంగా చేస్తే టీడీపీ నాయకుల వద్ద మార్కులు కోల్పోవాల్సి వస్తుందని ఆ నామినేషన్లు కూడా ఓకే చేసి పిచ్చమ్మకు కుక్కర్‌, బాలమ్మకు స్టూల్‌ గుర్తులను కేటాయించి ఆర్వో తన పచ్చ భక్తిని చాటుకున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వార్డు అభ్యర్థిని నాగమ్మ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement