ప్రశాంత ఎన్నికలకు పటిష్ట భద్రత కల్పించండి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలకు పటిష్ట భద్రత కల్పించండి

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

సున్నిత గ్రామాల్లో అదనపు పోలీసు బలగాలు మొహరించాలి పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అభ్యర్థులు, ఓటర్లకు బెదిరింపులు లేకుండా చూడండి ఎస్పీకి వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి

ఒంగోలు సిటీ: దర్శి నియోజకవర్గంలో ఈ నెల 29న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. దర్శి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, కొందరు వ్యక్తులు వైఎస్సార్‌ సీపీ మద్దతుతో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు, వారి మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. పోలీసు కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. గతంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఫిర్యాదులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ముండ్లమూరు, దర్శి, కురిచేడు, దొనకొండ, తాళ్లూరు మండలాల్లోని సున్నిత, సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించాలని కోరారు. ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు, పోలవరం, శంకరాపురం, మారెళ్ల, వేముల, ఉల్లగల్లు, దర్శి మండలంలోని యర్రోబనపల్లి, తుమ్మెదలపాడు, కురిచేడు మండలంలోని నమశ్శివాయపురం, గంగదేవిపల్లి, దొనకొండ మండలంలోని పోలేపల్లి, గంగదేవిపల్లి, కోచర్లకోట, చందవరం, ఇండ్లచెర్వు, పెద్దనపాలెం, దొనకొండ, తాళ్లూరు మండలంలోని శివరాంపురం, కొర్రపాటివారిపాలెం, బెల్లంకొండవారిపాలెం, మల్కాపురం గ్రామాల్లో ప్రత్యేక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన దృశ్యాలను భద్రపరచాలని కోరారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులను బెదిరించడం, వేధించడం, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలను అరికట్టాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరపాలని కోరారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ రోజున, అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీనియర్‌ పోలీసు అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని బూచేపల్లి శివప్రసాదరెడ్డి వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement