ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

రెండో దశ 123 పంచాయతీల్లో నేడు పోలింగ్‌ క్షేత్ర స్థాయి పరిస్థితిని పరిశీలించాం: కలెక్టర్‌ రాజాబాబు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాం: ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు విలేకర్ల సమావేశంలో కలెక్టర్‌, ఎస్పీ వెల్లడి

అద్దంకి రూరల్‌: రెండో దశ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. ఆదివారం జరగనున్న పంచాయతీ ఎన్నిక నేపథ్యంలో కలెక్టర్‌, ఎస్పీ కలసి అద్దంకి, దర్శిలో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం అద్దంకిలో ఆర్డీవో కార్యాయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ పి.రాజాబాబు మాట్లాడుతూ జిల్లా రెండో విడత ఎన్నికలు జరుగుతున్న బల్లికురవ, సంతమాగులూరు, కురిచేడు, దొనకొండ మండలాల్లో పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లో 123 పంచాయతీలకు, 1020 వార్డులకు పోలింగ్‌ జరగనున్నట్లు చెప్పారు. విధులకు హాజరవుతున్న సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చామన్నారు. పోలింగ్‌ సామగ్రి పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లాయన్నారు. ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ఉంటుందని, అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ టీవీల ద్వారా ప్రత్యక్ష వీక్షణ చేస్తామన్నారు. సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో వీడియోగ్రాఫర్ల ద్వారా మొత్తం ప్రక్రియను రికార్డు చేయిస్తున్నట్లు వివరించారు. ఫలితాలను కూడా అప్పటికప్పుడే ప్రకటించి వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో నమోదు చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించకుండా పనిచేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎస్పీ వీ.హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. 66 అత్యంత సమస్యాత్మక, 71 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. మొత్తం 1623 మంది పోలీస్‌ సిబ్బందిని ఎన్నికల్లో భద్రత విధుల కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్‌, ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్‌ నాయుడు, తహసీల్దార్‌ శ్రీచరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement