అద్దంకి: మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామిని సినిమా హీరో శ్రీకాంత్ శనివారం దర్శించుకున్నారు. అయ్యప్ప మాల ధరించిన ఆయన స్వామివారి దర్శనం కోసం రాగా, అర్చకులు ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజల అనంతరం, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్‌రావు స్వామివారి శేష వస్త్రం అందజేసి పూలమాలతో సత్కరించారు. అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ (ఏపీసీ)గా పనిచేస్తున్న దాసరి అనిల్ కుమార్‌ని మార్కాపురం జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. ప్రకాశం జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌తో మార్కాపురం జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటరుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా రాష్ట్ర సమగ్ర శిక్ష పథక సంచాలకులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనిల్ కుమార్ రెండు రోజుల్లో మార్కాపురం ఏపీసీ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం.
ఒంగోలు సిటీ: ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిస్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడం, బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని యూటీఎఫ్ ప్రకాశం జిల్లా కమిటీ పేర్కొంది. అనంతపురం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడిని ఓ ఎమ్మెల్యే నిందిస్తూ, బెదిరింపు ధోరణితో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడాన్ని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిని బహిరంగంగా దూషించడం, బెదిరించడం సమర్థనీయం కాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులు, ఆధారాలు ఉంటే చట్టప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలే తప్ప రాజకీయ పలుకుబడితో బెదిరించడం సరికాదన్నారు. జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇటువంటి ఘటనలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


