● కలెక్టర్ పి.రాజా బాబు
ఒంగోలు సబర్బన్: ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి జలధార–జలహారతి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సాధించిన పురోగతిపై వాటర్ షెడ్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ శనివారం అమరావతి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన పనులు, వాటిలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. సమావేశంలో డ్వామా పీడీ జోసఫ్ కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ వరలక్ష్మి, భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని విద్యార్థులకు సురక్షిత మంచి నీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఆ శాఖ డెప్యూటీ డైరక్టర్ ఎన్ లక్ష్మా నాయక్ అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవనంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాల వసతి గృహ అధికారులకు సురక్షిత తాగునీటిని అందించే విధానంపై శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఫీల్డ్ టెస్ట్ కిట్లపై వార్డెన్లకు ప్రత్యక్ష అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి హాస్టల్‌కు ఎఫ్‌టీకే కిట్‌లను పంపిణీ చేస్తామని, ప్రతినెలా నీటి నాణ్యత పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఒంగోలు ఏఎస్‌డబ్ల్యూఓ రబియా, అద్దంకి ఏఎస్‌డబ్ల్యూఓ స్వరూప, దర్శి ఏఎస్‌డబ్ల్యూఓ, కనిగిరి అసిస్టెంట్ డైరెక్టర్ ఆది లక్ష్మి, శివనాయక్, కొండపి ఏఎస్‌డబ్ల్యూఓ జాన్ ప్రసాద్, బేస్తవారిపేట ఏఎస్‌డబ్ల్యూఓ రామకృష్ణారెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం: తన స్నేహితులతో కలిసి గంజాయి దమ్ము పీకుతూ మరో రౌండ్ ఇవ్వలేదని యువకుడు పోలీస్ స్టేషన్ కాంపౌండ్‌లో ఉన్న సెల్ టవర్ ఎక్కిన సంఘటన శనివారం మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చుక్కలు చూపించిన ఆ యువకుడు కిందికి దిగివచ్చిన తరువాత గంజాయి ఇప్పించండి సార్ అని ఎస్సై దేవకుమార్‌ను అడిగాడు. స్థానిక తిరుమలగిరి కాలనీకి చెందిన ఉడతల హనుమంతు తన స్నేహితులతో కలిసి గంజాయి తాగుతున్నాడు. చివరగా తనకు దమ్ము ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న టవర్ ఎక్కాడు. తనకు గంజాయి ఇప్పిస్తేనే తాను కిందికి దిగివస్తానని, లేకుంటే కిందికి దూకుతానని పోలీసులను బెదిరించాడు. అక్కడికి చేరిన పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హనుమంతును కిందికి దించారు. కాగా హనుమంతు పుటుగా మద్యం తాగి టవర్ ఎక్కాడని పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం గమనార్హం. నీకు ఏమి కావాలని కిందికి దిగివచ్చిన ఆ యువకుడిని ఎస్సై ప్రశ్నించగా మద్యం కావాలని అడిగాడని ఆ ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. మత్తులో ఉన్న హనుమంతును 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు.


