ఇదేం విస్తరణ | - | Sakshi
Sakshi News home page

ఇదేం విస్తరణ

Apr 25 2026 9:36 AM | Updated on Apr 25 2026 9:36 AM

హైవే నుంచి పట్టణంలోకి రోడ్ల విస్తరణ పనులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కేవలం రెండు అడుగుల మేర విస్తరణ వల్ల ఎవరికి ప్రయోజనం? పది రోజులుగా నిలిచిన విస్తరణ పనులు కందుకూరు, బడేవారిపాలెం, వలేటివారిపాలెం, చుండి ప్రాంతాల్లో రూ.6 కోట్లతో హైవే నుంచి అంతర్గత రోడ్ల విస్తరణ

కందుకూరు: జాతీయ రహదారి 167బి నుంచి కందుకూరు పట్టణంలోకి వచ్చే అంతర్గత రోడ్డు (ఓవి రోడ్డు) విస్తరణ పనులు చర్చనీయాంశంగా మారాయి. పట్టణంలోకి వచ్చే ఓవీ రోడ్డును కేవలం ఇరువైపులా రెండు అడుగుల మేర పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఉపయోగం లేని ఈ విస్తరణ పనుల వల్ల ఎవరికి ప్రయోజనం అనే ప్రశ్న తలెత్తుతోంది. పైగా ఆ పనులు కూడా పది రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, మైనింగ్‌శాఖ నుంచి ఎదురవుతున్న సమస్యల వల్ల పనులు నిలిచిపోయాయని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెప్తున్నారు. పనులు ప్రారంభించి ఆపేయడం వల్ల విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. మరో రెండు, మూడు రోజుల్లో తిరిగి పనులు ప్రారంభిస్తామంటూ ఎన్‌హెచ్‌ అధికారులు చెప్తున్నారు.

రూ.6 కోట్లతో విస్తరణ పనులు

సింగరాయకొండ జాతీయ రహదారి నుంచి కడప జిల్లా మైదుకూరు వరకు నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి 167బి నిర్మాణం చేసే సమయంలో పలుచోట్ల అంతర్గత రోడ్లు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కందుకూరు పట్టణానికి దక్షిణంవైపు బైపాస్‌ రోడ్డు నిర్మించారు. ఈ బైపాస్‌ వలేటివారిపాలెం నుంచి వచ్చే సమయంలో చెర్లోపాలెం వద్ద ప్రారంభమై, సింగరాయకొండ రోడ్డులో సీఐటీఆర్‌ఐ వద్ద ముగుస్తుంది. దీంతో చెర్లోపాలెం వద్ద నుంచి పట్టణంలోకి వచ్చే రోడ్డు, ఇటు సీటీఆర్‌ఐ నుంచి పట్టణంలోకి వచ్చే రోడ్డు ఇరుకు రోడ్లుగా మారిపోయాయి. బైపాస్‌ నుంచి పట్టణంలోకి వచ్చే ఈ రెండు రోడ్లను విస్తరిస్తున్నారు. వీటితో పాటు బడేవారిపాలెంలోకి సీసీ రోడ్డు, డ్రైనేజీ, వలేటివారిపాలెంలోకి బీటీ రోడ్డు, చుండి వద్ద సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులకు గాను రూ.6 కోట్ల నిధులను జాతీయ రహదారుల సంస్థ ఖర్చు చేస్తోంది. ఈ పనుల బాధ్యతను ఒంగోలుకు చెందిన కాంట్రాక్టు సంస్థకు అప్పచెప్పారు. ఆ సంస్థ నెల రోజుల క్రితం పనులు ప్రారంభించి కొంత మేర చేసి ప్రస్తుతం పనులు నిలిపివేసింది.

అరకొరగా విస్తరణ:

ఈ పనుల పట్ల ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు వలేటివారిపాలెం నుంచి, ఇటు సీటీఆర్‌ఐ వద్ద ఉన్న బైపాస్‌ రోడ్డు నుంచి పట్టణంలోకి వచ్చే రెండు రోడ్లు వెడల్పు తక్కువగా ఉంటాయి. భారీ వాహనాలు రెండు ఎదురెదురుగా వస్తే సైడ్‌ ఇవ్వడం కూడా కష్టమే. జాతీయ రహదారి నిర్మాణం తరువాత ఈ రెండు రోడ్లు విస్తరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నాయి. ఎట్టకేలకు ఆ పనులు చేపట్టినా రోడ్లను వెడల్పు చేస్తున్న తీరుపట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అటూ, ఇటూ కేవలం రెండు అడుగుల మేర మాత్రమే పెంచుతున్నారు. దీని వల్ల ఎంత మేరకు రోడ్డు వెడల్పు పెరుగుతుందంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న పనుల వల్ల ఏ ఉపయోగం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం కాంట్రాక్టరుకు ప్రయోజనాలు తప్పా ప్రజలకు ఉపయోగం లేని విస్తరణ అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఎన్‌హెచ్‌ అధికారులు మాత్రం డబుల్‌ రోడ్డు చేస్తున్నామంటే, ప్రస్తుతం ఐదు మీటర్లు ఉంటే దాన్ని ఏడు మీటర్లకు పెంచుతున్నామని చెప్తున్నారు. మరింత వెడల్పు చేయాలంటే విద్యుత్‌లైన్‌లు మార్చడంతో పాటు, ఇతర సమస్యలున్నాయంటున్నారు. ప్రస్తుతానికి ఈ పనులు పూర్తి చేసి ఆర్‌అండ్‌బీ శాఖకు రోడ్లను అప్పగిస్తామని, ఆ తరువాత వాళ్లు ఎంత వెడల్పు అయినా చేసుకోవచ్చు అని చెప్తున్నారు.

ఆగిన పనులు... వాహదారులకు నరకం:

ఈ పనులు కూడా పది రోజులుగా కాంట్రాక్టు సంస్థ నిలిపేసింది. కొంతమేర పనులు చేసి నిలిపేయడం వల్ల ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా సీటీఆర్‌ఐ నుంచి కందుకూరు పట్టణంలోకి వచ్చే రోడ్డుకు ఓ వైపు రోడ్డు నుంచి రెండు అడుగుల మేర లోతు తవ్వి వదిలేశారు. మరోవైపు కంకర మాత్రమే వేసి వదిలేశారు. గుంట తవ్విన వైపు కనీసం ప్రయాణికులకు తెలిసేలా రేడియం స్టిక్కర్‌లు వంటివి కూడా సక్రమంగా లేవు. దీని వల్ల రాత్రిపూట వెళ్లే వాహనాలు రోడ్డు మార్జిన్‌లో ఉన్న గుంటను గమనించలేక అందులో పడుతున్నారు. ఇటీవల రెండు ఆటోలు, ద్విచక్ర వాహనాలు పడిపోవడంతో వాహదారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటు వలేటివారిపాలెం వైపు వెళ్లే రోడ్డు విస్తరణ కూడా ఇదే పరిస్థితి. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలా రోడ్డును తవ్వి వదిలేయడం ప్రయాణికుల పాలిట ప్రాణ సంకటంగా మారింది.

మైనింగ్‌ శాఖ అనుమతుల్లో సమస్య:

పనులు నిలిచిపోవడానికి పలు కారణాలను ఎన్‌హెచ్‌ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మైనింగ్‌శాఖలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల రోడ్డు నిర్మాణ మెటీరియల్‌కు ఇబ్బంది ఏర్పడుతోంది. మైనింగ్‌శాఖ నుంచి అనుమతి తీసుకుని మెటీరియల్‌ తెచ్చుకోవాల్సి ఉందని, అలా కాకుండా తీసుకొస్తే ఏఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. మైనింగ్‌శాఖలో లీజు కోసం దరఖాస్తు చేసే వెబ్‌సైట్‌ మార్పు వల్ల ఈ సమస్య ఏర్పడిందన్నారు. అలాగే పనులు చేసే కార్మికులు పశ్చిబెంగాల్‌ ప్రాంతానికి చెందిన వారు కావడంతో అక్కడ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కార్మికులు వెళ్లారు. అలాగే అమెరికా–ఇరాన్‌ యుద్ధం కారణంగా బిటుమిన్‌ దొరికే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో బిటుమిన్‌ టన్ను రూ.45 వేలు ఉంటే ప్రస్తుతం అది రూ.90 వేలకు పెరిగిపోయిందన్నారు. అయినా దిగుమతి లేకపోవడం వల్ల డిమాండ్‌ ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు.

త్వరలోనే పనులు ప్రారంభిస్తాం

బైసాస్‌ రోడ్డు నుంచి కందుకూరు పట్టణంలోకి వచ్చే ఓవీ రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయిన మాట వాస్తమే. కార్మికులు అందుబాటులో లేకపోవడం, మెటీరియల్‌ సమస్య వల్ల పనులు నిలిచిపోయాయి. నిలిచిపోయిన పనులను మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈలోపు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

– సుమన్‌, ఎన్‌హెచ్‌ జేఈ

Advertisement
 
Advertisement
Advertisement