టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నరాధాకృష్ణ యావత్ మహిళా లోకాన్ని కించపరుస్తూ తప్పుడు వ్యాఖ్యలు మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినందునే పోలీసులకు ఫిర్యాదు చేశాం రోజులు గడుస్తున్నా కేసు నమోదు ఎందుకు చేయలేదు ఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు మేరుగు నాగార్జున, చుండూరి రవిబాబు
ఒంగోలు టౌన్: జర్నలిజం ముసుగులో మహిళలపై తప్పుడు రాతలు రాస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ మీద ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా ఎందుకు కేసు నమోదు చేయడంలేదని, మహిళా లోకం సిగ్గుతో తలవంచుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ మీద వెంటనే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, పార్టీ నాయకులతో కలిసి ఆయన శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని క్యాంపు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదు చేసినా కనీసం ఒక్క పోలీసు స్టేషన్లో కూడా కేసు నమోదు చేయకపోవడం విస్మయానికి గురిచేసిందన్నారు. ఒక ప్రధాన పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి దుర్మార్గంగా మాట్లాడితే దేశం మొత్తం విస్మయం చెందిందని చెప్పారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు ఎక్కువయ్యాయని, కూటమి ప్రభుత్వం దళితులపై దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు కూటమి పాలకులు దండలు వేసినా, వేయకపోయినా మా గుండెల్లో ఎప్పుడూ ఉంటారని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని జగనన్న ఏర్పాటు చేస్తే దాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి నేలబారు పనులు మానుకోవాలని హితవు చెప్పారు.
రోజుకు రూ.500 కోట్లు ఏమౌతున్నాయో....
ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతుంటే పాలకులు, వారి అనుంగ పత్రికలు సహించలేకపోతున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అరాచకాలను ఎండగడుతున్న వారిపై అవాకులు చెవాకులు పేలుతున్న ఎల్లో మీడియా తీరు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో చేసిన అప్పు రూ.3.30 లక్షల కోట్లు కాగా, రోజుకు రూ.500 కోట్ల చొప్పున నెలకు రూ.1500 కోట్లు అప్పులు చేస్తుందని వివరించారు. అయినా సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారని, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల జీతాలకే సరిపోవడంలేదని చెబుతున్న చంద్రబాబు ఈ కోట్ల అప్పులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి పేరుతో అవినీతితో దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని రైతాంగాన్ని దోచుకుంటున్నారని, ఆరోగ్యశ్రీ బిల్లులు సక్రమంగా చెల్లించడంలేదని, విద్యా వసతి అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలను అమ్ముకుంటుండడాన్ని ప్రశ్నిస్తుంటే, ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి ఏబీఎన్ రాధాకృష్ణను రంగంలోకి దించారని విమర్శించారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీని తిట్టే పనిని రాధాకృష్ణ తన నెత్తిన వేసుకున్నాడని చెప్పారు. సిద్దాంతపరంగా మాట్లాడితే మా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జవాబు ఇవ్వగలరని, పార్టీ విధానాల పరంగా మాట్లాడితే తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు జగనన్న నేర్పిస్తున్నాడన్న అక్కసుతో రాధాకృష్ణ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను దూషించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దూషణలతో కుంగిపోయేదిలేదని, మరింత ఆత్మస్థైర్యంతో పనిచేస్తామని, ఈ కూటమి అరాచకాలను, అప్పుల లెక్కలను తేలుస్తామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, యరజర్ల రమేష్, రవి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున, పక్కన చుండూరి రవిబాబు


