భూములు గిరిజనులవి.. పరిహారం కూటమి నేతలకు | - | Sakshi
Sakshi News home page

భూములు గిరిజనులవి.. పరిహారం కూటమి నేతలకు

Apr 25 2026 9:36 AM | Updated on Apr 25 2026 9:36 AM

గుడ్లూరు: తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను టీడీపీ నేతలు అక్రమంగా ఆన్‌లైన్‌ చేయించుకుని రామాయపట్నం పోర్టు కింద పరిహారం పొందేందుకు కుట్ర పన్నుతున్నారని, తమకు న్యాయం చేయాలని మండలంలోని చేవూరు గ్రామానికి చెందిన గిరిజనులు గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరాహార దీక్ష చేసి నిరసన తెలిపారు. గ్రామంలోని సర్వే నంబరు 860లో ఎ1–36 సెంట్లు భూమిని ప్రభుత్వం 1982వ సంవత్సరంలో పోట్లూరు అంకులయ్యకు డీ పట్టా ఇచ్చింది. అదే గ్రామంలో 962 సర్వేనంబరులో ఎ3–61 సెంట్ల భూమికి యాకసిరి లక్ష్మయ్యకు డీపట్టా ఇచ్చారు. 861 సర్వే నంబరులో ఎ1–50 సెంట్ల భూమికి చేవూరు రవికి పట్టా ఇచ్చారు. చేవూరు రైతులు రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం భూములిచ్చారు. ఆ రైతులకు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గ్రామంలోని తెలుగుదేశం నాయకులు నక్కల శేషయ్య, మాదాల సుబ్బారావు తమ భూములను ఆక్రమించుకొని, తమ పేర్లు తొలగించి రెవెన్యూ అధికారుల ద్వారా వారి పేర్లును ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకుని నష్టపరిహారం పొందటానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. అసైన్‌మెంట్‌ భూములను వేరే వ్యక్తులకు బదిలీ చేయటానికి లేదు. రెవెన్యూ అధికారులు చేతివాటంతో పేర్లుమార్చి తమ పొలాలను ఇతరుల పేరు మీద ఆన్‌లైన్‌ చేశారని, ఈవిషయంపై గతంలో కందుకూరు సబ్‌కలెక్టర్‌ శ్రీపూజకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల మళ్లీ మా భూములకు సంబంధించిన పరిహారం మాకు చెందకుండా కూటమి నాయకులు వారి పేర్లమీద బ్యాంకు ఖాతాలో జమచేయమని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని బాధితులు తెలిపారు. ఆమేరకు తహశీల్దార్‌ బాల కిశోర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తహశీల్దార్‌ను వివరణ కోరగా అసైన్‌మెంట్‌ భూములు అన్యాక్రాంతం చేయటం చట్టారీత్యా నేరం అని, దీనిపై సమగ్ర విచారణ చేసి గిరిజనులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బాధితులు పోట్లూరు ప్రసాదు, యాకసిరి లక్షమ్మ, చేవూరు రవి, సీపీఎం నాయకులు గుడ్లూరు ఏరియా కార్యదర్శి జీ వెంకటేశ్వర్లు, జాలయ్య, అంజయ్య పాల్గొన్నారు.

తహశీల్దార్‌ కార్యాలయం దగ్గర

గిరిజనుల ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement