చీమకుర్తి రూరల్: పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి చీమకుర్తి మండలంలోని చండ్రపాడు గ్రామంలో బస చేశారు. ముందుగా గ్రామస్తులతో సమస్యలపై చర్చించారు. స్థానికులు అనేక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా వితంతువులకు పింఛన్లు, తల్లికి వందనం, తాగునీటి సరఫరా, హరిజనవాడలో డ్రైనేజీ సమస్య, రోడ్లు, తదితర సమస్యలను ఏకరువు పెట్టారు. చండ్రపాడు గ్రామంలోని చెరువుకు సంబంధించి మూడు తూముల ద్వారా నీళ్లు రావడం లేదని, ఆ సమస్యను పరిష్కరించాలని పలువురు రైతులు కోరారు. చండ్రపాడు నుంచి నేలటూరుకు, లక్ష్మీపురంకు రోడ్లు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్‌ను కోరారు. శనివారం ఉదయం గ్రామంలో తాను పర్యటించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని, సంబంధిత అధికారుల ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జేసీ కల్పనా కుమారి, స్థానిక ఎమ్మెల్యే విజయ్‌కుమార్, ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


