లడ్డూపై బాబు అండ్ కో కొత్త డ్రామా
ఎలాంటి కొవ్వులు కలవలేదని సిట్ నివేదిక వెంటనే మాట మార్చిన చంద్రబాబు బాత్రూం రసాయనాల వినియోగం అంటూ తప్పుడు ప్రచారం స్వార్థ రాజకీయాల కోసం లడ్డూపై విష ప్రచారం సనాతన ధర్మం పేరుతోపవన్ దొంగాట దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు అండ్ కో కొత్త డ్రామాలకు తెరసిందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదిక వచ్చే వరకూ హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే వెంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీల్లో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు విష ప్రచారం చేశారని ఆరోపించారు. సిట్ నివేదిక వచ్చాక ప్రసాదంలో బాత్రూంలకు వినియోగించే రసాయనాలు వాడారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ తిన్న ఎంత మంది భక్తులు అనారోగ్యానికి గురయ్యారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా తిరుపతి లడ్డూపై రాజకీయం చేయడం తగదని ఆయన ఖండించారు. సిట్ కోర్టుకు అందించిన నివేదికలో జంతుకొవ్వులు కలవలేదని పేర్కొందని చెప్పారు. 03–08–22లో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బోలేబాబా, వైష్ణవి తదితర సంస్థలు సరఫరా చేసిన నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిస్తే జంతుకొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని నివేదికలో ఎక్కడా చెప్పలేదన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డూపై తప్పుడు ప్రచారానికి దిగారని బూచేపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ సమర్పించిన నివేదికలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 06–07–24 నుంచి 12–07–24 నుంచి సేకరించిన శాంపిల్స్‌లో కూడా ఫిష్ ఆయిల్ కలవలేదని వచ్చిందన్నారు. దీనిని బట్టి ఎక్కడా జంతుకొవ్వు, పంది కొవ్వు కలవలేదని స్పష్టమవుతోందన్నారు. సిట్ నివేదిక బహిరంగమయ్యాక చంద్రబాబు మాటమార్చారని, బాత్రూంలకు వినియోగించే రసాయనాలు వాడారంటూ అసత్య ప్రచారానికి తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీ ఫాంల్లో క్లీనింగ్ కోసం వినియోగించే రసాయనాలు లడ్డూలో కలిసిందని చెప్పడం రాజకీయ కక్షలో భాగమేనన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏనాడూ తన రాజకీయ స్వార్థం కోసం దేవుళ్లను వాడుకోలేదన్నారు. జగన్ నుంచి హిందువులను దూరం చేసేలా కుట్రలకు దిగుతున్నారన్నారు. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్వే రిపోర్టులు వస్తుండడంతో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ విషయంలో ప్రజలు తన మాటలు నమ్మడంలేదని గుర్తించి జనసేన, బీజేపీ నాయకులతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించే దుస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు.
పవన్ రోజుకో మతం జపం..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజుకో మతాన్ని జపిస్తున్నారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు తన తండ్రి దేవుడ్ని పూజించరని, దేవుడి దీపంతో సిగరెట్ వెలిగించేవారని చెప్పారని గుర్తు చేశారు. నేడు సనాతన ధర్మం పేరుతో అధర్మాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, దేవుడికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. బీజేపీ అధ్యక్షుడు సైతం తన మాటల్లో ఎక్కడా జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చెప్పలేదన్నారు.
కమిటీలు ఎందుకు:
దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్ ఇచ్చిన నివేదికను కాదని ఇప్పుడు తన సొంత మనుషులతో వేసిన కమిటీ ఎందుకని బూచేపల్లి ప్రశ్నించారు. మీ పార్టీ నాయకులతో వేసిన కమిటీ మీకు అనుకూలంగా నివేదిక ఇస్తుందన్న విషయం అందరికీ తెలుసన్నారు. మీకు అనుకూలంగా మాట్లాడలేదని టీటీడీ ఈఓ అశోక్ సింఘాల్‌ను బదిలీ చేశారని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, బొట్ల రామారావు, తదితరులు పాల్గొన్నారు.


