ఉద్యోగుల బకాయిలు చెల్లించండి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల బకాయిలు చెల్లించండి

Feb 9 2026 8:11 AM | Updated on Feb 9 2026 8:11 AM

ఉద్యోగుల బకాయిలు చెల్లించండి

ఉద్యోగుల బకాయిలు చెల్లించండి

ఈ బడ్జెట్‌లోనే నిర్ధిష్ట కేటాయింపులుండాలి బూచేపల్లికి వినతిపత్రం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి

ఒంగోలు సిటీ: ఉద్యోగుల బకాయిలకు సంబంధించి రూ.35 వేల కోట్లను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించేలా కృషి చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఒంగోలు వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆదివారం బూచేపల్లిని కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హక్కుగా సంక్రమించి ఇప్పటికే మంజూరైన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు రూ.35 వేల కోట్లకు చేరాయన్నారు. మంజూరు కావాల్సిన వేతన సవరణ, 4 విడతల డీఏ, సరెండర్‌ లీవులు తదితర ప్రయోజనాల అంచనా కొన్ని వేల రూ.కోట్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్ని వేల కోట్ల రూపాయల చెల్లింపు ప్రభుత్వానికి అసాధ్యంగా మారిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా మన సంఘం ‘బాకీకి భూమి’ అనే ప్రతిపాదనను అటు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ధిష్టమైన స్పందన లేనందున ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తీవ్ర ఆవేదన నెలకొందన్నారు. మరోపక్క వంది మాగదులుగా తయారైన భజన సంఘాలు ప్రభుత్వంతో చర్చించేశాం, వేల కోట్ల బకాయిల చెల్లింపులు అయిపోయాయి, వరాల జల్లులు కురిసిపోయాయి అంటూ యథావిధిగా తమ భజన కొనసాగిస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేసిన నేపథ్యంలో, ఉద్యోగులకు ఇప్పటికే మంజూరు చేసి పెండింగ్‌లో ఉన్న బకాయిలు, అలాగే మంజూరు చేయాల్సిన ఆర్ధిక ప్రయోజనాలు సిట్టింగ్‌ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు, నాలుగు విడతల డీఎలు, మధ్యంతర భృతి తదితర అంశాలకు ఈ బడ్జెట్‌లోనే నిర్ధిష్టమైన కేటాయింపులు చూపాలన్నారు. ప్రత్యామ్నాయ పరిష్కారంపై ప్రభుత్వం తమ విధాన ప్రకటనను బడ్జెట్‌ ద్వారా తెలియపరచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వరకుమార్‌, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మహిళా విభాగం చైర్మన్‌ ప్రసన్న, ఒంగోలు సెక్రటరీ శ్రీనివాస యాదవ్‌. యేసు రత్నం, అంకబాబు, వంశీకృష్ణ, చంచారావు, హరిబాబు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement