మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం
జీజీహెచ్‌లో వైద్యులను నియమించాల్సిందే మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మార్కాపురంలో మెడికల్ కాలేజీని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిపేసి పీపీపీ విధానంలోకి తీసుకుని రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై సుమారు 3 నెలల పాటు ఉద్యమాలు కూడా చేశామని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్పారు. మార్కాపురం పట్టణంలోని వివిధ వార్డుల్లో ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పలు మెడికల్ కాలేజీలను మంజూరు చేయగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి పలు చోట్ల పూర్తిచేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో వాటిని ప్రైవేటుపరం చేసేందుకు పీపీపీ విధానం తెచ్చారని, దీన్ని తాము వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడంతో నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జీజీహెచ్‌లో సుమారు 75 మంది వైద్యులను నియమించగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రస్తుతం జీజీహెచ్‌లో 9 నుంచి 15 మంది మాత్రమే ఉండటం శోచనీయమన్నారు. వైద్యం కూడా ప్రైవేటుపరం చేయడంతో పేద ప్రజలకు అందని ద్రాక్షలాగా మారిందన్నారు. నాణ్యమైన వైద్యం కోసం మళ్లీ ఒంగోలు, గుంటూరుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీజీహెచ్‌లో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ సమస్యపై పోరాటం చేస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయంపై ప్రజలకు వివరించాలని తెలిపారు.


