మంత్రి గారూ.. మరిచిపోయారా..?
అద్దంకి రూరల్:
అద్దంకి పట్టణంలో 50 వేల జనాభా, మండలంలో మరో 50 వేల మంది, నాలుగైదు మండలాల నుంచి అద్దంకికి వచ్చే వారితో కలుపుకొని 2 లక్షలకు పైనే జనాభాకు పట్టణంలోని సీహెచ్‌సీ వైద్యశాలే దిక్కు. పెరుగుతున్న జనాభాకు, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వైద్యశాల స్థాయి పెరగలేదు. దీంతో చిన్న చిన్న వైద్య సేవలు తప్ప పెద్ద పెద్ద వైద్య సేవలకు ఒంగోలు, గుంటూరు, విజయవాడ వంటి నగరాలకు పరుగులు తీయాల్సిన పరిస్థతి. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న రవికుమార్ పట్టణానికి వంద పడకల వైద్యశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా వంద పడకల వైద్యశాల హామీని పూర్తిగా విస్మరించారు. ఒక్కసారి కూడా దానిపై సమీక్షించడం గానీ, భవిష్యత్‌లోనైనా చేద్దామని ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వంద పడకల వైద్యశాల తేవాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతలపూడి అశోక్‌కుమార్ నడుం బిగించారు. మీరు తెస్తారా? లేక మేము వచ్చిన తరువాత వంద పడకల వైద్యశాల తెచ్చుకోమంటారా? అనే సవాల్ విసురుతున్నారు.
ఉన్నతస్థాయి వైద్యం కరువు..
అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాల ప్రజలకు ఎలాంటి రోగాలు వచ్చిన అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు తమ స్థాయిలో ప్రాథమిక వైద్యం చేస్తారు. పెద్ద పెద్ద జబ్బులు అయితే వెంటనే ఒంగోలుకు లేదా మరో నగరానికి సిఫార్సు చేస్తారు. సీహెచ్‌సీలో నిపుణులైన వైద్యులు ఉన్నా పరికరాలు, వివిధ విభాగాలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో వంద పడకల వైద్యశాల అవసరం అద్దంకికి ఎంతైనా అవసరం.
అద్దంకి హైవేపై తరుచూ ప్రమాదాలు
అద్దంకిలో ఉన్న హైవేపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చిన వారికి ప్రాథమిక వైద్యం చేయడం తప్ప వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి. మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు లేదా గుంటూరు సిఫార్సు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందక మార్గమధ్యంలోనే మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అద్దంకిలోనే 100 పడకల వైద్యశాల ఉంటే ఎంతో మంది ప్రాణాలతో బయటపడేవారు. ఇక్కడ ప్రసూతి, జ్వరాలు, జలుబు, చిన్నపిల్లలు వైద్యం వంటి సాధారణ విభాగాలు మినహా, ఇతర ఆధునికమైన పరికరాలు, వైద్యం అందే స్థాయి ఈ వైద్యశాలకు లేదు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో మంత్రి గొట్టిపాటి హామీ ఇవ్వడంతో అందరూ సంతోషించారు. ఆయన ఎమ్మెల్యే నుంచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా అద్దంకికి 100 పడకల వైద్యశాల మంజూరు పట్ల అలివిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు.
వైద్యశాల సాధనకు ఉద్యమం
అద్దంకిలో 100 పడకల వైద్యశాల సాధనకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ అశోక్‌కుమార్ నడుం బిగించారు. విద్య, వైద్యం అద్దంకి ప్రజలకు అందనంత దూరం చేసిన ప్రజాప్రతినిధులు అలసత్వాన్ని ఖండిస్తూ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
అది చేస్తాం..ఇది చేస్తాం..అంటూ ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం..అధికారం రాగానే
ఆ హామీని, ప్రజలను విస్మరించడం నేతలకు రివాజుగా మారింది. అద్దంకికి 100 పడకల వైద్యశాల కూడా ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ఎన్నికల సమయంలో ఆర్భాటంగా హామీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్..18 నెలల్లో ఆ హామీని పూర్తిగా మరిచిపోయారని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు.
ఎన్నికల సమయంలో అద్దంకిలో 100 పడకల ఆస్పత్రికి గొట్టిపాటి హామీ
18 నెలలైనా ఆ ఊసే ఎత్తని వైనం
సీహెచ్‌సీ స్థాయికే పరిమితమైన వైద్యశాల
మెరుగైన వైద్యానికి నగరాలకు తప్పని పరుగులు
మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు
100 పడకల వైద్యశాల సాధనకు నడుం బిగించిన వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్


